ఫ్లోరిడా (అమెరికా): వారం వ్యవధిలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు రెండో పరాజయం ఎదురైంది. గత ఆదివారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ఓడిన ఫెడరర్... మయామి మాస్టర్స్ టోర్నీలో మాత్రం రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 175వ ర్యాంకర్ థనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ఫెడరర్ 6–3, 3–6, 6–7 (4/7)తో పరాజయం పాలయ్యాడు. గతేడాది ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్ ఈసారి వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు.
మయామి టోర్నీలో రెండో రౌండ్‌లోనే ఓడినందుకు ఫెడరర్ భారీ మూల్యమే చెల్లించుకోనున్నాడు. ఏప్రిల్ 2న విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతను తన టాప్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకుంటాడు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తాను క్లే కోర్టు సీజన్‌లో బరిలోకి దిగడంలేదని ఫెడరర్ ప్రకటించాడు. ఫలితంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ఫెడరర్ వరుసగా రెండో ఏడాది దూరం కానున్నాడు. తగినంత విశ్రాంతి తీసుకొని జూన్‌లో జరిగే వింబుల్డన్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతానని తెలిపాడు.
యూకీ బాంబ్రీ ఓటమి: మరోవైపు మయామి మాస్టర్స్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో యూకీ 3–6, 6–7 (3/7)తో ఎనిమిదో సీడ్ జాక్ సోక్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్‌లో ఓడిన యూకీకి 25,465 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 55 వేలు)తోపాటు 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment