
ఫెడరర్ సూపర్ ‘షో’
మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన స్విస్ దిగ్గజం
ఫెడరర్‌తో జతకట్టిన సానియా, బోపన్న
ఎదురులేని ఇండియన్ ఏసెస్
వేలాది మంది అభిమానుల కల సాకారం అయ్యింది. భారత గడ్డపై తొలిసారి టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆటను తిలకించే భాగ్యం దక్కింది. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భాగంగా ఇండియన్ ఏసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్విట్జర్లాండ్ స్టార్ ఆదివారం తన అద్వితీయ ఆటతీరుతో అందర్నీ అలరించాడు.
సింగిల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జాతో... పురుషుల డబుల్స్‌లో భారత్‌కే చెందిన రోహన్ బోపన్నతో కలిసి ఆడిన ఫెడరర్ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. ఫలితంగా ఈ లీగ్‌లో ఇండియన్ ఏసెస్ ఆరో విజయంతో దూసుకుపోతోంది.
న్యూఢిల్లీ: అంతా తానై నడిపించిన రోజర్ ఫెడరర్ ఐపీటీఎల్‌లో ఇండియన్ ఏసెస్ జట్టు ఖాతాలో మరో విజయాన్ని జతచేశాడు. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ జట్టు 26-16 పాయింట్ల తేడాతో సింగపూర్ స్లామర్స్‌ను చిత్తుగా ఓడించింది. లెజెండ్స్ సింగిల్స్‌లో అమెరికా దిగ్గజం పీట్ సంప్రాస్ (ఏసెస్) 2-6తో ప్యాట్రిక్ రాఫ్టర్ చేతిలో ఓడిపోయినా... తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఏసెస్ ఆటగాళ్లు విజయం సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫెడరర్-సానియా మీర్జా ద్వయం 6-0తో హంతుచోవా-నిక్ కిర్గియోస్ జంటను ఓడించి ఏసెస్‌కు తొలి విజయాన్ని అందించారు.
ఆ తర్వాత డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్-రోహన్ బోపన్న జంట 6-1తో లీటన్ హెవిట్-కిర్గియోస్ ద్వయంపై నెగ్గింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఫెడరర్ 6-4తో బెర్డిచ్‌పై గెలిచాడు. చివరిదైన మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-5తో హంతుచోవాను ఓడించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫెడరర్-సానియా ఆటతీరుకు ప్రత్యర్థి జంట ఒక్క గేమ్‌నూ గెల్చుకోలేకపోవడం విశేషం. ఫెడరర్‌తో కలిసి ఆడటం గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన సానియా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ స్విస్ స్టార్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడాలనుకుంటున్నట్లు సరదాగా వ్యాఖ్యానించింది. మరో మ్యాచ్‌లో మనీలా మావ్రిక్స్ 27-24 స్కోర్‌తో యూఏఈ రాయల్స్‌పై విజయం సాధించింది.
మోసపోయాం...
టికెట్ ధరలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో ఐపీటీఎల్ నిర్వాహకులు విఫలమయ్యారని పలువురు అభిమానులు విమర్శించారు. మూడు రోజులకు కలిపి రూ. 29 వేలు వెచ్చించి టికెట్ కొనుగోలు చేస్తే... తనకు కేటాయించిన స్థానం నుంచి మ్యాచ్‌లను స్పష్టంగా చూసే అవకాశం లేకుండా పోయిందని సునీత సిగిత అనే అభిమాని వాపోయింది. ‘టికెట్ ధరలకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి. దుబాయ్ ఓపెన్‌లో తక్కువ ధరలకే ఫెడరర్‌ను అతి దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రం అలాంటి సౌకర్యమే లేదు. నిర్వాహకులు మమ్మల్ని మోసం చేశారు’ అని సునీత విమర్శించింది.
‘భారత్‌కు రావడం, ఇక్కడ ఆడటం ప్రత్యేకంతోపాటు ఆనందంగా అనిపిస్తోంది. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన భారత్‌లాంటి దేశంలో ఆడటం గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం మాత్రమే ఇక్కడికి రాగలుగుతాను. భారత్ ఆతిథ్యం అద్భుతం. ప్రత్యేక ఫార్మాట్‌తో వచ్చిన ఐపీటీఎల్ ద్వారా టెన్నిస్‌కు మేలు జరుగుతుందనేది నా నమ్మకం. ఇక భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఒకట్రెండుసార్లు కలుసుకున్నాను. వింబుల్డన్‌లో నా మ్యాచ్‌లు తిలకించేందుకు అతను కూడా వచ్చాడు.’ -ఫెడరర్