మొహాలి: టీమిండియా ఓపెనింగ్ జోడి శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు మరో ఘనతను సాధించారు. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జాబితాలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల జోడి రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో వన్డేలో ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్-ధావన్‌ల జంట.. సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీల జోడి తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. ప్యాట్ కమిన్స్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి ధావన్ ఫోర్ కొట్టడంతో ద్వారా భారత్ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన రెండో జోడిగా నిలిచింది.
ఈ క్రమంలోనే ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్(4,387 పరుగులు) జోడిని వెనక్కినెట్టింది. వన్డే ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామన్ని నమోదు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడి తొలి స్థానంలో ఉంది. వీరిద్దరూ 8, 227 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. కేవలం భారత్ తరఫునే కాకుండా ఓవరాల్‌గా కూడా సచిన్-సౌరవ్‌ల జోడినే అత్యధిక పరుగుల భాగస్వామ్యంలో టాప్‌లో ఉండటం విశేషం. కాగా, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించిన రోహిత్-ధావన్‌ల జోడి.. సచిన్-సెహ్వాగ్‌ల సెంచరీల భాగస్వామ్యం రికార్డును అధిగమించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా 14వ సారి ఆ ఘనతను రోహిత్-ధావన్‌ల జోడి సొంతం చేసుకుంది.
ఆసీస్‌తో నాలుగో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్-ధావన్‌లు ఆరంభించారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 తేడాతో ముందజలో ఉంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను ఖతాలో వేసుకోవాలని భారత్ భావిస్తోంది. అదే సమయంలో భారత్‌కు మరోసారి షాక్ ఇవ్వాలని ఆసీస్ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment