
మాంచెస్టర్: భారత ఆటగాడిగా తాను చేసే ప్రతీ సెంచరీ ప్రత్యేకమైనదేనని, ఏది అత్యుత్తమమని అడిగితే చెప్పలేనని ఓపెనర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఆదివారం మ్యాచ్‌లో పాక్ పేసర్లు ఎక్కువగా షార్ట్ పిచ్ బంతులు వేశారని, అదే తన బలం కాబట్టి చెలరేగిపోయానని అతను విశ్లే షించాడు. ఇంగ్లండ్ మైదానాల్లో ఒకసారి నిలదొక్కుకుంటే బ్యాట్స్‌మెన్‌ను నిరోధించడం చాలా కష్టమని... అందుకే తనను ఆపడంలో ప్రత్యర్థి విఫలమైందని రోహిత్ అన్నాడు. మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న పాక్‌కు మీరు ఎలాంటి సలహా ఇస్తారు అని ప్రశ్నించగా...‘నేను పాకిస్తాన్ జట్టుకు కోచ్‌గా మారినప్పుడు దీనికి సమాధానం చెబుతా’ అని గడుసుగా జవాబిచ్చాడు.
అది అసలైన టెస్టు బంతి...
మ్యాచ్‌లో బాబర్‌ను బౌల్డ్ చేసిన బంతి పట్ల తాను గర్వపడుతున్నట్లు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెప్పాడు. ‘బాబర్‌ను దుబాయ్‌లో కూడా ఒకసారి ఔట్ చేశాను. అది స్ఫూర్తిగా తీసుకున్నా. మ్యాచ్‌లో అప్పటికే నేను బంతిని బాగా టర్న్ చేస్తున్నాను. అది నా ప్రధాన బలం. ఆ బంతి కూడా చాలా బాగా పడింది. దీనిని చూసి నేనే కాదు ప్రతీ స్పిన్నర్ గర్వపడతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టెస్టుల్లోనూ ఇలాంటి బంతి మనకు కనిపిస్తుంది’ అని కుల్దీప్ విశ్లేషించాడు. మరోవైపు తామిద్దరి బౌలింగ్ ఎండ్‌లు మార్చమని చహల్ చెప్పిన తర్వాతే కుల్దీప్ ఆ వికెట్ పడగొట్టాడని...చహల్ వ్యూహం కోహ్లితో చర్చించి అమలు చేశామని రోహిత్ వెల్లడించాడు.