
రాస్ టేలర్ మరో సెంచరీ
వెల్లింగ్టన్: రాస్ టేలర్ (227 బంతుల్లో 129; 15 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ శతకంతో చెలరేగడంతో వెస్టిండీస్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో న్యూజిలాండ్ మొదటి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది.
ఇక్కడి బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ‘సున్నా’ పరుగుల వద్ద స్లిప్స్‌లో ఎడ్వర్డ్స్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన టేలర్...విలియమ్సన్ (83 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) సహకారంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. టెస్టు కెరీర్‌లో పదో సెంచరీ పూర్తి చేసుకున్న టేలర్... 4 వేల పరుగులు మైలురాయిని కూడా అందుకున్నాడు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్‌కు 2 వికెట్లు దక్కాయి. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది.