Kane Williamson breaks Ross Taylor's record to become New Zealand's highest Test run-scorer - Sakshi
Sakshi News home page

NZ VS ENG 2nd Test: కేన్‌ విలియమ్సన్‌ ఖాతాలో భారీ రికార్డు.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ చరిత్రలోనే..!

Published Mon, Feb 27 2023 11:37 AM | Last Updated on Mon, Feb 27 2023 12:25 PM

Kane Williamson Breaks Ross Taylor Record, Becomes New Zealand Highest Test Run Scorer - Sakshi

న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్సన్‌ ఖాతాలో అతి భారీ రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ నాలుగో రోజు ఆటలో సూపర్‌ సెంచరీ (132) సాధించి, ఫాలో ఆన్‌ ఆడుతున్న తన జట్టును గట్టెక్కించిన కేన్‌ మామ.. న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక టెస్ట్‌ పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

25 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు బరిలోకి దిగిన విలియమ్సన్‌.. ఆండర్సన్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది న్యూజిలాండ్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌గా అవతరించాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 92 టెస్ట్‌లు ఆడిన విలియమ్సన్‌ 53.33 సగటున 26 సెంచరీలు, 33 అర్ధసెంచరీల సాయంతో 7787 పరుగులు చేసి, కివీస్‌ మాజీ కెప్టెన్‌ రాస్‌ టేలర్‌ (112 టెస్ట్‌ల్లో 44.66 సగటున 19 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీల సాయంతో 7683 పరుగులు)ను వెనక్కు నెట్టి కివీస్‌ తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ తర్వాత స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (7172), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (6453), మార్టిన్‌ క్రో (5444), జాన్‌ రైట్‌ (5334), టామ్‌ లాథమ్‌ (5038) వరుసగా 3 నుంచి 7 స్థానాల్లో నిలిచారు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 202/3తో (ఫాలో ఆన్‌) నాలుగో రోజు ఆటను కొనసాగించిన న్యూజిలాండ్‌.. అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి మ్యాచ్‌ చేజారకుండా కాపాడుకునే ప్రయత్నం చేసింది. న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ (132) సూపర్‌ సెంచరీతో జట్టును ఆదుకోగా.. డారిల్‌ మిచెల్‌ (54), టామ్‌ బ్లండల్‌ (90) తమ పాత్రలను న్యాయం చేశారు. ఫలితంగా న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోర్‌ చేసి, ప్రత్యర్ధికి 258 పరుగుల డిఫెండింగ్‌ టార్గెట్‌ను నిర్ధేశించింది.

కష్టసాధ్యంకాని టార్గెట్‌ను ఛేజ్‌ చేసేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. తమదైన స్టయిల్‌లో ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. వరుస బౌండరీలతో విరుచుకుపడిన జాక్‌ క్రాలే (30 బంతుల్లో 24; 5 ఫోర్లు) మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఓటవ్వగా.. బెన్‌ డక్కెట్‌ (23), ఓలీ రాబిన్సన్‌ (1) ఆచితూచి ఆడుతున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసి, లక్ష్యానికి 210 పరుగుల దూరంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్‌ ఆడింది. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement