చెస్టర్ లీ స్ట్రీట్: తమ అంతిమ లక్ష్యం వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో విజేతగా నిలవడమే అంటున్నాడు ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 481 పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇంగ్లండ్.. ఐదు వన్డేల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే 4-0తో కైవసం చేసుకుంది. దీనిలో భాగంగా మాట్లాడిన జాసన్ రాయ్.. తాము సాధిస్తున్న విజయాలు వరల్డ్ కప్‌కు పునాది రాళ్లుగా అభివర్ణించాడు.
‘రికార్డులు ఎప్పుడూ గొప్పవే. ఇంకా చెప్పాలంటే.. మా శ్రమకి తగిన బహుమతులు. కానీ.. మా అంతిమ లక్ష్యం ఒకటే.. వచ్చే ఏడాది ప్రపంచకప్ గెలవడం. రికార్డుల్ని బద్దలు కొట్టడం చాలా గొప్ప విషయం. ఈ విజయాలన్నీ ప్రపంచకప్‌కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి. వరుస విజయాలు, రికార్డులు మా జట్టు వరల్డ్ కప్ సాధించడానికి పునాది రాళ్లు’ అని రాయ్ వెల్లడించాడు. క్రికెట్ పుట్టినిల్లుగా పిలువబడే ఇంగ్లండ్ ఇప‍్పటివరకూ ఒక్క వన్డే వరల్డ్ కప్‌ను కూడా సాధించలేదు. దాంతో ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది ఇంగ్లండ్. స్వదేశంలో తమకు ఉన్న అనుకూలతను అన్ని రకాలుగా ఉపయోగించుకుని మెగా ట్రోఫీని తొలిసారి అందుకోవాలనే ఆశతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment