న్యూఢిల్లీ: ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగడం, ఆపై అభిమానుల ఆశలను నిరాశ పరచడం ఆర్సీబీకి పరిపాటిగా మారింది. ఆ జట్టులో ఎంతమంది స్టార్ ఆటగాళ్లున్నా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్‌ను సాధించి పెట్టలేకపోయారు. గత సీజన్‌లో బౌలింగ్ పరంగానూ జట్టు మెరుగ్గా కనిపించినా చివరికి వచ్చేసరికి పరిస్థితి మాత్రం ఎప్పటిలాగే కనిపించింది. ఈ నేపథ్యంలో తమ యాజమాన్య బృందంలో కొన్ని మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేసింది.
ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇన్నాళ్లూ జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డానియల్ వెటోరీకి ఉద్వాసన పలకనున్నట్టు సమాచారం. గత రెండు పర్యాయాల్లో జట్టు పేలవ ప్రదర్శన ఆయనపై ప్రభావం చూపింది. ఆయనతో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ ట్రెంట్ వుడ్‌హిల్ (ఆస్ట్రేలియా), బౌలింగ్ కోచ్ మెక్ డొనాల్డ్ (ఆస్ట్రేలియా)ను బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బౌలింగ్ సలహాదారుడిగా ఆశిష్ నెహ్రా కొనసాగనున్నాడు.
ప్రస్తుతం బ్యాటింగ్ మెంటార్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టన్ ఆర్‌సీబీ కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సైతం పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆర్సీబీ యాజమాన్యం నిర్వహించే సమావేశంలో కోచ్ మార్పు అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లి సూచనలు కీలకం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment