భళా... బెంగళూరు | Royal Challengers defend 157 despite Pant's belligerence | Sakshi
Sakshi News home page

భళా... బెంగళూరు

Published Sun, Apr 9 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

భళా... బెంగళూరు

భళా... బెంగళూరు

►  కేదార్‌ జాదవ్‌ మెరుపులు
► ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 15 పరుగుల తేడాతో గెలుపు
► రిషభ్‌ పోరాటం వృథా  


బెంగళూరు: బౌలర్ల సమష్టి కృషితో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌–10లో బోణీ కొట్టింది. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు 15 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను కంగుతినిపించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కేదార్‌ జాదవ్‌ (37 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. మోరిస్‌కు 3, జహీర్‌కు 2 వికెట్లు దక్కాయి.

తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. రిషభ్‌ పంత్‌ (36 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా తన జట్టును గట్టెక్కించలేకపోయాడు. చిన్నస్వామి స్టేడియంలో ఓ జట్టు 200 కంటే తక్కువ స్కోరు చేసి నెగ్గడం రెండేళ్లలో ఇదే తొలిసారి.

జాదవ్‌ ఒక్కడే...
టాస్‌ గెలిచిన బెంగళూరు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా... క్రిస్‌ గేల్‌ (6), కెప్టెన్‌ వాట్సన్‌ (24 బంతుల్లో 24; 4 ఫోర్లు) శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. మోరిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో భారీషాట్‌కు ప్రయత్నించిన గేల్‌... మిడాఫ్‌లో శామ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు.

క్రీజులోకి వస్తూనే బౌండరీలతో జోరు చూపిన మన్‌దీప్‌ (12; 3 ఫోర్లు) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. కాసేపటికే వాట్సన్‌... నదీమ్‌ బౌలింగ్‌లో స్టంపౌటై నిష్క్రమించాడు. 55 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన దశలో కేదార్‌ జాదవ్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. భారీ సిక్సర్లతో బెంగళూరు ప్రేక్షకుల్ని అలరించాడు. స్టువర్ట్‌ బిన్నీ (16)తో కలిసి నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు. జహీర్‌ ఖాన్‌... బిన్నీని ఔట్‌ చేయడంతో బెంగళూరు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.  

పంత్‌ పట్టుదల...
అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ బ్యాట్స్‌మెన్‌  బెంగళూరు కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలవంచారు. ఓపెనర్లు ఆదిత్య తారే (17 బంతుల్లో 18; 3 ఫోర్లు), బిల్లింగ్స్‌ (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఇదే స్కోరు వద్ద తారే... మిల్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డవగా, 5 పరుగుల వ్యవధిలో కరుణ్‌ నాయర్‌ (4) బిల్లీ స్టాన్‌లేక్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

శామ్సన్‌ (13) కూడా విఫలమవడంతో 84 పరుగుల వద్ద 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రిషభ్‌ పంత్‌ జట్టు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. భారీ సిక్సర్లతో రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే మరోవైపు మోరిస్‌ (4), బ్రాత్‌వైట్‌ (1), కమిన్స్‌ (6)లు విఫలమవడంతో రన్‌రేట్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఒత్తిడి పెరిగింది. చివరి ఓవర్‌లో 19 పరుగులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. పవన్‌ నేగి వేసిన ఈ ఓవర్‌ తొలి బంతికే రిషభ్‌ బౌల్డ్‌ కావడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు. స్టాన్‌లేక్, ఇక్బాల్‌ అబ్దుల్లా, నేగి తలా 2 వికెట్లు తీశారు.

విషాదాన్ని అధిగమించి ఇన్నింగ్స్‌ను నడిపించిన రిషభ్‌ పంత్‌ పట్టుదల అందర్నీ ఆకట్టుకుంది. బుధవారం రాత్రి తన తండ్రి హఠాన్మరణంతో అంత్యక్రియలకు వెళ్లిన రిషభ్‌ పంత్‌ గురువారం దహన సంస్కారాలు చేస్తుండగా స్వల్ప గాయాలయ్యాయి. దుఃఖాన్ని దిగమింగి శుక్రవారమే జట్టుతో కలిశాడు. రోజు వ్యవధిలో తొలి మ్యాచ్‌ ఆడి కడదాకా చేసిన పోరాటం జట్టుకు విజయాన్నివ్వకపోయినా... తన ఆటతీరుతో అందరి మనసుల్ని గెలిచాడు పంత్‌.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) శామ్సన్‌ (బి) మోరిస్‌ 6; వాట్సన్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) నదీమ్‌ 24; మన్‌దీప్‌ సింగ్‌ (బి) కమిన్స్‌ 12; జాదవ్‌ (సి) మోరిస్‌ (బి) జహీర్‌ ఖాన్‌ 69; బిన్నీ (సి) బిల్లింగ్స్‌ (బి) జహీర్‌ ఖాన్‌ 16; విష్ణు వినోద్‌ (రనౌట్‌) 9; నేగి (బి) మోరిస్‌ 10; అబ్దుల్లా నాటౌట్‌ 5; మిల్స్‌ (బి) మోరిస్‌ 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 157.
వికెట్ల పతనం: 1–26, 2–41, 3–55, 4–121, 5–142, 6–142, 7–157, 8–157. బౌలింగ్‌: జహీర్‌ 4–0–31–2, మోరిస్‌ 4–0–21–3, కమిన్స్‌ 4–0–29–1, నదీమ్‌ 4–0–13–1, మిశ్రా 2–0–32–0, బ్రాత్‌వైట్‌ 2–0–29–0.
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఇన్నింగ్స్‌: ఆదిత్య తారే (బి) మిల్స్‌ 18; బిల్లింగ్స్‌ (సి) స్టాన్‌లేక్‌ (బి) అబ్దుల్లా 25; కరుణ్‌ నాయర్‌ (బి) స్టాన్‌లేక్‌ 4; శామ్సన్‌ (సి) బిన్నీ (బి) స్టాన్‌లేక్‌ 13; రిషభ్‌ పంత్‌ (బి) నేగి 57; మోరిస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అబ్దుల్లా 4; బ్రాత్‌వైట్‌ (బి) చహల్‌ 1; కమిన్స్‌ (బి) వాట్సన్‌ 6; మిశ్రా నాటౌట్‌ 8; నదీమ్‌ (సి అండ్‌ బి) నేగి 0; జహీర్‌ ఖాన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1–33, 2–38, 3–55, 4–84, 5–107, 6–113, 7–125, 8–139, 9–139.  బౌలింగ్‌: స్టాన్‌లేక్‌ 4–0–29–2, చహల్‌ 4–0–19–1, అబ్దుల్లా 3–0–36–2, మిల్స్‌ 4–0–33–1, వాట్సన్‌ 4–0–21–1, నేగి 1–0–3–2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement