ఉరుగ్వే... ఎప్పుడో 1950లో చివరిసారిగా విజేతగా నిలిచింది. రష్యా... ఆతిథ్య హోదాతో అర్హత పొందింది. ఈజిప్ట్... రెండుసార్లు వైదొలగి, రెండుసార్లు గ్రూప్ దశతోనే సరిపెట్టుకుంది. సౌదీ అరేబియా... నాలుగుసార్లు పాల్గొని ఒక్కసారి గ్రూప్ స్టేజ్ దాటగలిగింది. ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ పరిస్థితిది. ఈ లెక్కను బట్టి చూస్తే రెండుసార్లు విజేత ఉరుగ్వేనే అత్యుత్తమంగా కనిపిస్తోంది. సొంతగడ్డ సానుకూలతతో రష్యా సంచనాలు సృష్టిస్తే తప్ప, నాకౌట్ చేరే రెండో జట్టుగా అంతోఇంతో ఈజిప్ట్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. – సాక్షి క్రీడా విభాగం
రష్యా... అంతా అనుకూలిస్తేనే...
ప్రపంచకప్ ఆతిథ్య హక్కుల కోసం తొలిసారిగా 2008లో బిడ్ వేసినప్పుడు రష్యా అద్భుత ఫామ్‌లో ఉంది. ఆ ఏడాది యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు చేరింది. దీని ప్రకారమైతే ఆ జట్టు ఇప్పటికి ఎంతో ఎదిగి ఉండాలి. సొంతగడ్డపై జరుగనున్న పోటీల్లో ఓ బలమైన జట్టుగా వార్తల్లో నిలవాలి. కానీ, ఎదుగూబొదుగు లేని ప్రదర్శనతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఈ పదేళ్లలో పాల్గొన్న ఏ పోటీలోనూ గ్రూప్ దశ దాటలేకపోయింది. మైదానంలో ప్రదర్శన ఇలా ఉంటే... మైదానం బయట ఆటగాళ్లు, కోచ్‌కు పడటం లేదు. దీనికితోడు ఆకతాయి ‘హూలిగన్ల’ బెడద ఒకటి. 2016 యూరో చాంపియన్ షిప్‌లో వారి ప్రవర్తన రష్యా ప్రతిష్ఠను బాగా దెబ్బతీయడమే కాక టోర్నీ నుంచి వెళ్లగొట్టేంతవరకు వచ్చింది. ఇన్ని అడ్డంకుల మధ్య ఎలా రాణిస్తుందో చూడాలి.
కీలకం: ఇగోర్ అకిన్‌ఫీవ్. ప్రతిభావంతుడైన గోల్‌కీపర్. జట్టు కెప్టెన్. అయితే, పెద్ద టోర్నీల్లో నిరాశ పరుస్తుంటాడు.
కోచ్: స్టానిస్లావ్ చెర్చేవ్. ఖరీదైన విదేశీ కోచ్‌లు ఫాబియో కాపెల్లో (ఇటలీ), గూస్ హిడింక్ (నెదర్లాండ్స్)లతో లాభం లేదని స్వదేశీ, మాజీ గోల్ కీపర్ అయిన చెర్చేవ్‌ను ఎంచుకున్నారు. కఠినంగా వ్యవహరిస్తూ రక్షణాత్మక ఆట పద్ధతులను అవలం బిస్తాడని పేరుంది. విభేదాల నేపథ్యంలో ఆటగాళ్లతో సమన్వయం ఎలా చేసుకుంటాడో చూడాలి.
ప్రపంచ ర్యాంక్: 66
చరిత్ర: ఇప్పటివరకు 10 సార్లు క్వాలిఫై అయింది. 1958–70 మధ్య నాలుగుసార్లు క్వార్టర్స్ చేరింది. 1966లో సెమీస్ వరకు వెళ్లగలిగింది. గత ప్రపంచకప్‌లో 24వ స్థానంలో నిలిచింది. ఇదే అతి చెత్త ప్రదర్శన.
ఉరుగ్వే... సీనియర్లు, యువరక్తం
ఒకదేశంగా మనకు ఈ పేరు పెద్దగా పరిచయం లేకున్నా... ఫుట్‌బాల్‌లో మాత్రం మంచి రికార్డే ఉంది. క్వాలిఫయింగ్ పోటీల్లో దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ తర్వాత ఈ జట్టే మెరుగైన ప్రదర్శన చేసింది. డిఫెండర్ డిగో గోడిన్, స్ట్రయికర్లు ఎడిన్సన్ కవాని, లూయీస్ సురెజ్‌ల వంటి సీనియర్ల ప్రభ తగ్గుతున్న సమయంలో... యువ మిడ్ ఫీల్డర్లు ఫెడ్రికో వాల్వెర్డె, నహిటన్ నాందెజ్ బాధ్యతలు తీసుకొని ప్రపంచకప్ బెర్తు అందించారు. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇప్పుడు కాకున్నా, 2022 నాటికి కప్ అందుకోగలమన్న ఆత్మవిశ్వాసంతో ఉంది.
కీలకం: కవాని. క్వాలిఫయింగ్ పోటీల్లో 18 మ్యా చ్‌ల్లో 10 గోల్స్‌తో టాపర్‌గా నిలిచాడు. సురెజ్ కంటే ఇతడిపైనే ఎక్కువ అంచనాలున్నాయి.
కోచ్: ఆస్కార్ తబ్రెజ్. 2006 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కోచ్‌గా ఇది నాలుగో ప్రపంచకప్. వరుసగా మూడోది. 70 ఏళ్ల ఆస్కార్... రెండేళ్ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చక్రాల కుర్చీ నుంచే కోచింగ్‌ను పర్యవేక్షించాడు.
ప్రపంచ ర్యాంక్: 17
చరిత్ర: 1930, 1950లలో విజేత. 12 సార్లు క్వాలిఫై అయింది. 2006లో అర్హత సాధించకున్నా... 2010లో 4వ స్థానంలో నిలిచింది. 2014లో 12వ స్థానంతో సరిపెట్టుకుంది.
సౌదీ... ఒక్క గెలుపైనా గొప్పే
పుష్కర కాలం తర్వాత అర్హత సాధించిన సౌదీ అరేబియా.. ప్రపంచకప్ సన్నాహాలు మాత్రం ఏమంత సాఫీగా లేవు. సాకర్‌లో ఎంతో కీలకమైన వ్యక్తి కోచ్. 9 నెలల్లోనే సౌదీ జట్టుకు మూడో కోచ్ వచ్చాడు. ప్రపంచకప్ డ్రాకు కొద్దిగా ముందు బవుజాను తప్పించారు. ఆ ప్రభావం ప్రాక్టీస్ మ్యాచ్‌లపై పడింది. అంతకుముందు సెప్టెంబరు వరకు కోచ్‌గా ఉన్న మార్విక్ జట్టు క్వాలిఫై అయ్యేలా తీర్చిదిద్దాడు. తాజాగా ఆంటోనియో పిజ్జిని కోచ్‌గా తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్క విజయం సాధించినా అది సంచలనమే.
కీలకం: అల్ సాల్వి. 30 ఏళ్ల ఈ స్ట్రయికర్ అర్హత పోటీల్లో 16 గోల్స్‌తో కీలక పాత్ర పోషించాడు.
కోచ్: జువాన్ ఆంటోనియో పిజ్జి. జట్టుకు పూర్తిగా కొత్త. పరిస్థితులు, ఆటగాళ్లను అర్థం చేసుకుంటూ ఇతడు ఏమేరకు నడిపిస్తాడో చూడాలి.
ప్రపంచ ర్యాంక్: 67
చరిత్ర: 1994 నుంచి 2006 వరకు వరుసగా క్వాలిఫై అయింది. తొలిసారి 12వ స్థానంలో నిలిచి ఆశ్చర్యపర్చినా, తర్వాత మూడు ప్రయత్నాల్లో గ్రూప్ దశ దాటలేదు.
ఈజిప్ట్... రెండో బెర్తుతోనైనా
ఏడుసార్లు ఆఫ్రికా చాంపియన్. 2012–15 మధ్య ఆఫ్రికా నేషన్స్ కప్‌లో రాజ్యమేలింది. ఓ దశలో అదే కప్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చింది. అయితే ఇప్పుడు జట్టు కొత్తదనంతో కనిపిస్తోంది. ఈ ఏడాది ఫైనల్ చేరింది. అదే ఊపులో 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ బెర్తు కొట్టేసింది. ఉరుగ్వే కొరుకుడుపడకున్నా, రష్యా, సౌదీలను ఓడించగలిగితే గ్రూప్ నుంచి రెండో స్థానంతో నాకౌట్‌కు వెళ్తుంది.
కీలకం: మొహహ్మద్ సలా. ఆరు అర్హత మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్ కొట్టాడు. జట్టులో ఏకైక స్టార్.
కోచ్: హెక్టర్ కుపెర్. అర్జెంటీనా మాజీ ఆటగాడు. రక్షణాత్మక ఆటకు ప్రాధాన్యమిస్తాడు. తర్వాత దాడుల గురించి ఆలోచిస్తాడు. ఇది మూస పద్ధతి అని విమర్శలు వచ్చినా అవే జట్టును ఇక్కడవరకు తీసుకొచ్చాయి.
ప్రపంచ ర్యాంక్: 46
చరిత్ర: 1934లోనే అర్హత సాధించింది. 1938లో ఓసారి, 1958–66 మధ్య మూడుసార్లు వైదొలగింది. 1990లో పునరాగమనం చేసినా గ్రూప్ దశ అధిగమించలేదు.
Comments
Please login to add a commentAdd a comment