సెరెనా, వీనస్ లు డోపింగ్ కి పాల్పడ్డారా?
అమెరికన్ మహిళా టెన్నిస్ దిగ్గజాలు సెరెనా విలియమ్స్, వీనస్ లు డోపింగ్ కు పాల్పడ్డారా?. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నారు. సెరెనా, వీనస్ లతో పాటు రియో ఒలింపిక్స్ లో నాలుగు బంగారుల పతకాలు సాధించిన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ కూడా నిషేధ ఉత్ర్పేరకాలు వాడినట్లు వారు పేర్కొన్నారు.
వాడా వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన రష్యాకు చెందిన 'ఫ్యాన్సీ బీరర్స్' హ్యాకర్లు అమెరికన్ ఆటగాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను బయటపెట్టినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. వాడా డేటాబేస్ లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట డజన్ల కొద్ది అమెరికన్ అథ్లెట్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినా.. వారు క్రీడల్లో పాల్గొనేందుకు వాడా అంగీకరించినట్లు ఫ్యాన్సీ బీరర్స్ పేర్కొంది.
ఈ వార్తలపై స్పందించిన వాడా తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైనట్లు ప్రకటించింది. క్రీడాకారులు గాయపడినప్పుడు ఉపయోగించే మందులలో వాడా నిషేధిత ఉత్ప్రేరకాన్ని అమెరికన్లు ఉపయోగించినట్లు ఫ్యాన్సీ బీరర్స్ తెలిపింది. వాడా నిబంధనల ప్రకారం గాయాల దృష్ట్యా నిషేధిత మందు వినియోగం అనివార్యమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలి. ఈ నిబంధనను అడ్డంపెట్టుకుని అవసరం ఉన్నా లేకపోయినా అమెరికన్ అథ్లెట్లు దొంగ సర్టిఫికేట్లను సృష్టించి ఉత్ప్రేరకాలను తీసుకున్నారని ఫ్యాన్సీ బీరర్స్ పేర్కొంది.
రియోలో అమెరికా సాధించిన పతాకాలన్నీ నిషేధిత ఉత్ర్పేరకం ఉపయోగించి గెలుచుకున్నవేనని ఆరోపించింది. క్రీడాకారులకు చెందిన రహస్య సమాచారాన్ని దొంగిలిచడాన్ని వాడా ఖండించింది. గత మూడు వారాలుగా వాడా వెబ్ సైట్ ను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు వాడా చైర్మన్ తెలిపారు. ఫ్యాన్సీ బీరర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నిషేధిత ఉత్ప్రేరకాలైన ఆక్సీకొడోన్, హైడ్రోమార్ఫోన్, ప్రిడ్నిసోన్, మిథైల్ ప్రిడ్నిసోలోన్ లను సెరెనా విలియమ్స్ 2010, 2014, 2015లలో వినియోగించినట్లు చెప్పింది.
ప్రిడ్నిసోన్, ప్రిడ్నిసోలోన్, ట్రైయామ్సీలోన్ లాంటి నిషేధిత ఉత్ర్ఫేరకాలను 2010, 2011, 2012, 2013లలో వీనస్ ఉపయోగించినట్లు పేర్కొంది. అయితే, నిషేధిత ఉత్ర్పేరకాలను ఉపయోగించిన అథెట్లను వాడా ఎందుకు అనుమతించిందనే వివరాలు డేటాబేస్ లో లేవని తెలిపింది. రియోలో నాలుగు స్వర్ణాలు సాధించిన జిమ్నాస్ట్ బైల్స్ మిథైల్ ఫెనిడేట్ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్నివినయోగించినా ఆమెపై నిషేధం విధించలేదని చెప్పింది. ఫ్యాన్సీ బీరర్స్ ప్రకటనలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసి) స్పందించింది. హ్యాకర్ల గ్రూప్ ప్రకటించిన ఆటగాళ్లలో ఎవరూ డోపింగ్ కు పాల్పడలేదని పేర్కొంది. ప్రపంచస్థాయి అథ్లెట్ల గౌరవానికి భంగం కలిగేలా చేయడాన్ని ఖండించింది.