విజయానంతరం సోదరి వీనస్‌తో ఆత్మీయ ఆలింగనం
సాక్షి క్రీడావిభాగం
సెరెనా విలియమ్స్ తొలి గ్రాండ్‌స్లామ్ విజయానికి, 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు మధ్యలో 6349 రోజుల వ్యవధి ఉంది. ఇన్ని రోజుల్లో ప్రపంచం చాలా మారిపోయింది. కానీ కొత్త మిలీనియంకు అటువైపు, ఇటువైపు ప్రతినిధిగా ఇప్పటికీ సెరెనా జైత్రయాత్ర మాత్రం ఇంకా కొనసాగుతోంది. 18 ఏళ్ల ప్రాయంలో ప్రపంచాన్ని గెలిచిన రోజు నుంచి మరో 18 ఏళ్ల తర్వాత కొత్త చరిత్రను సృష్టించే రోజు వరకు ఆమె చేసిన ప్రయాణం అసమానం. సాధించిన ప్రతీ ఘనత ఒక అద్భుతం. ఆమె ఆటలో పవర్ ఉంది. మాటల్లో పంచ్ ఉంది. అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకొని నిలిచిన తర్వాత ప్రపంచాన్నే ఎదిరించిన ధిక్కారం కూడా సెరెనాలో కనిపిస్తుంది.
జాతీయ నంబర్‌వన్‌గా ఉన్నా పదేళ్ల వయసులోనే వర్ణ వివక్ష కారణంగా టోర్నమెంట్‌ల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితుల నుంచి ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదగడం వరకు కసిగా ఆమె ఆటతోనే అందరికీ సమాధానమిచ్చింది. 14 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌గా మారిన సెరెనా, 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా టెన్నిస్ ప్రపంచాన్ని శాసించగలగడం ఆమెను ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా నిలబెట్టాయి. తాజా విజయంతో మహిళల టెన్నిస్‌లో ఎవరు గొప్ప అనే చర్చకు ఆమె ఫుల్‌స్టాప్ పెట్టేసింది.
శ్వేత జాతీయులకంటే ఎక్కువగా గుర్తింపు దక్కాలంటే తాము అన్ని విధాలా ఎక్కువగా కష్టపడాలని, 150 శాతం ప్రదర్శన ఇస్తే గానీ వారితో సమంగా నిలవలేమనే బలమైన అభిప్రాయం నల్లజాతి అమెరికన్లలో ఉంది. గతంలోనూ పలువురు శ్వేత జాతీయేతరులు ఆటల్లో అగ్రగామిగా నిలిచినా సెరెనా ప్రస్థానం భిన్నం. ఇతర క్రీడలతో పోలిస్తే తెల్ల జాతీయుల ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉన్న టెన్నిస్‌లో ఆమె రారాణిగా ఎదగడం సెరెనాను మరింత స్పెషల్‌గా మార్చేశాయి. దోపిడీ దొంగలకు నిలయమైన కాంప్టన్ ప్రాంతంలో సెరెనా పెరిగింది. ఆమెతో పాటు సోదరి వీనస్‌ను అగ్రశ్రేణి క్రీడాకారిణులుగా తీర్చిదిద్దడంలో తండ్రి రిచర్డ్స్ విలియమ్స్ ఎన్నో కష్టనష్టాలకోర్చారు. సాధారణ కౌలు రైతు అయిన విలియమ్స్, టెన్నిస్ అకాడమీల వద్దకు వెళ్లి ప్రాక్టీస్ కోసం పాత బంతులు తనకు అమ్మమని అడిగిన రోజులు కూడా ఉన్నాయి! ఆరంభంలో కొద్ది రోజులు బయట శిక్షణ ఇప్పించినా, తనకున్న పరిజ్ఞానం, పుస్తకాల ద్వారా నేర్చుకున్న సమాచారంతో అతనే వారికి పూర్తి స్థాయి కోచ్‌గా మారిపోయాడు.
ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పోరాటం ఆపకపోవడం, నల్ల జాతికి సంబంధించిన వ్యాఖ్యల విషయంలో మాటకు మాట జవాబివ్వడంలో సెరెనా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు తనను, వీనస్‌ను ‘అన్నదమ్ములు’ అంటూ సంబోధించినవారిని హెచ్చరించడం, వింబుల్డన్‌లో ఆట పట్టిస్తున్న ప్రేక్షకులపై ‘నన్ను రెచ్చగొట్టొద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం, లైన్ ఉమెన్‌ను ‘గొంతు కోస్తా’ అంటూ బెదిరించడం సెరెనాకే చెల్లింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆడేది అక్కతోనే అయినా పాయింట్ పోగొట్టుకున్నప్పుడు ఆగ్రహంతో రాకెట్ విరిచేసి ఉద్వేగం ప్రదర్శించడం చూస్తే ఆమె విషయంలో విజయం విలువేమిటో అర్థమవుతుంది.
వరల్డ్ నంబర్‌వన్ క్రీడాకారిణిగా సెరెనా ఏమిటో ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ కోర్టు బయట కూడా ‘నలుపు’ గురించి తక్కువ చేసి మాట్లాడటం సెరెనాకు నచ్చదు. అది ఫ్యాషన్ విషయంలోనైనా సరే! అందానికి రంగుతో పని లేదంటూ తన పేరులో అక్షరాలను వెనక్కి రాస్తూ ANERE పేరుతో డిజైనర్ దుస్తుల, హెయిర్‌టెక్ పేరుతో సౌందర్య సాధనాల వ్యాపారంలోకి అడుగు పెట్టి చూపించింది.
23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్, 4 ఒలింపిక్ స్వర్ణాలు, 309 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్ (సశేషం), కోట్లాది డాలర్ల ఆదాయం... వీనస్ విజయ విహారం ఇంకా ముగిసిపోలేదు. మరిన్ని విజయాలు, మరెన్నో ఘనతలు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మాత్రం ఆమె జగజ్జేత స్థాయిని అనుభవిస్తూ శిఖరాన నిలిచిం ది. ‘బతకడం, ప్రేమించడం, గెలవడం కోసం పది సూత్రాలు’ అనేది సోదరి వీనస్‌తో కలిసి సెరెనా రాసిన పుస్తకం పేరు. దానికి తగినట్లుగానే ఎలా బతకాలో, ఆటను ఎంతగా ప్రేమిం చాలో, ఏ రకంగా గెలవాలో చేసి చూపించిన సెరెనాకు హ్యాట్సాఫ్.