కేరళలో స్టేడియానికి సచిన్ పేరు
త్రివేండ్రం : తమ రాష్ట్రంలోని ఓ క్రికెట్ స్టేడియానికి భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును పెట్టాలని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) నిర్ణయించింది. కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని ఓ పెవిలియన్‌కు ఇప్పటికే సచిన్ పేరు ఉండగా.. కొత్తగా స్టేడియానికి మాస్టర్ పేరును పెట్టే ఆలోచనలో ఉన్నట్టు కేసీఏ అధ్యక్షుడు టీసీ మాథ్యూ తెలిపారు. ‘ఏ స్టేడియానికి సచిన్ పేరును పెట్టాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే వాయనాడ్‌లో మైదానం పూర్తయ్యింది. ఇంకా కొన్ని ముగింపు దశలో ఉన్నాయి.
త్వరలోనే ఏ విషయమూ తేల్చేస్తాం. సచిన్‌ను కూడా సంప్రదించాం. మరోవైపు త్వరలో అందుబాటులోకి రాబోయే ప్రతీ క్రికెట్ స్టేడియంను అన్ని క్రీడలకు అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్నాం’ అని మాథ్యూ తెలిపారు. ఈ ఏడాది కేరళలో జరిగిన జాతీయ క్రీడలకు సచిన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అలాగే ఐఎస్‌ఎల్‌లో కేరళ బ్లాస్టర్‌కు సహ యజమానిగా కూడా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఓ సొంతిల్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.