జాగ్రత్త... వెనక్కు తగ్గొద్దు!
♦ భారత ఆటగాళ్లకు సచిన్, రవిశాస్త్రి సూచనలు
♦ రెండు జట్లూ సమతుల్యంగా ఉన్నాయి
రోజులు గడుస్తున్నకొద్దీ దక్షిణాఫ్రికాతో సిరీస్ వేడెక్కుతోంది. సఫారీ జట్టులోని కీలకమైన ఆటగాళ్లతో జాగ్రత్త అంటూ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ సూచన చేస్తే... ప్రత్యర్థి జట్టు పటిష్టంగా ఉన్నా... వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ఆటగాళ్లకు దిశా నిర్దేశనం చేస్తున్నారు. దాదాపు రెండు నెలలకు పైగా సాగే ఈ సుదీర్ఘ పర్యటన గురించి రెండు దేశాల్లో అటు అభిమానులతో పాటు ఇటు మాజీలు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ముంబై : స్వదేశంలో జరిగే సిరీస్‌లో దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ టీమిండియా ఆటగాళ్లకు సూచించారు. అద్భుత నైపుణ్యం ఉన్న తాహిర్.. ఈ సిరీస్‌లో కీలకం కానున్నాడని చెప్పారు. అయితే ప్రస్తుత భారత జట్టు కూడా మంచి సమతుల్యంతో ఉందని మాస్టర్ వెల్లడించారు. ‘జట్టులో నైపుణ్యం, అంకితభావం ఉన్న కుర్రాళ్లకు లోటు లేదు. వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. అవకాశం వస్తే అద్భుతాలు చేయగలరు. అయితే క్రికెట్‌కు వచ్చేసరికి షార్ట్‌కట్స్ ఉండవనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. మొత్తానికి ఈ సిరీస్ చాలా హోరాహోరీగా సాగుతుంది.
నా వరకైతే ఎక్కువగా టెస్టు సిరీస్‌పై దృష్టిపెట్టా. బలం, బలహీనతల్లో రెండు జట్లు సమానంగా ఉన్నాయి’ అని సచిన్ పేర్కొన్నారు. తానెప్పుడూ తక్కువ నైపుణ్యం ఉన్న ప్రొటీస్ జట్టుతో మ్యాచ్‌లు ఆడలేదని, ప్రతిసారి వాళ్లు పటిష్టమైన టీమ్‌గానే బరిలోకి దిగారన్నారు. ఇప్పుడు కూడా జట్టులో ఏం తేడా లేదని... డివిలియర్స్, ఆమ్లా, స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌లతో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. 1992 హీరో కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ మ్యాచ్ అద్భుతంగా జరిగిందన్నారు. ‘ఆ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అయితే గెలవాలన్న తపనను మాత్రం కొనసాగిస్తున్నాం.
హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు 2 పరుగుల తేడాతో నెగ్గాం. నాకు అదో మంచి అనుభవం. దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రతిసారి మంచి ఆతిథ్యంతో పాటు వాతావరణం, పిచ్ వంటి రకరకాల సవాళ్లు ఎదురయ్యేవి. 1991లో తొలిసారి భారత్‌లో పర్యటించిన సఫారీ జట్టుతో ఆడటం మాకు బాగా లాభించింది. ఈడెన్‌లో వేల మంది అభిమానులను చూసి వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ స్పందనను చూసి ఆశ్చర్యపోయారు’ అని మాస్టర్ గుర్తుచేసుకున్నారు.
బెంగళూరు: ఇటీవల కొంత మంది టాప్ ఆటగాళ్లు రిటైర్ అయినప్పటికీ సఫారీ జట్టు ఇంకా పటిష్టంగానే ఉందని భారత టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి అన్నారు. అయితే రాబోయే సిరీస్‌లో మాత్రం ప్రొటీస్‌పై భారత జట్టు తన దూకుడును ఏమాత్రం తగ్గించదని స్పష్టం చేశారు. ‘దక్షిణాఫ్రికా నంబర్‌వన్ జట్టు. విదేశాల్లో బాగా ఆడుతుంది. రికార్డులను చూస్తే తెలుస్తుంది. అయితే ఆ జట్టును గౌరవిస్తాం. కానీ ఆటపరంగా పరిస్థితులు ఎలా ఉన్నా మేం వెనక్కి తగ్గం’ అని శాస్త్రి వెల్లడించారు. జట్టును నడిపించడంలో ధోనికి ఎలాంటి ఇబ్బందిలేదని, అతను ప్రపంచస్థాయి ఆటగాడని కితాబిచ్చారు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకుపోవడం మ్యాచ్ పరిస్థితిని బట్టి కెప్టెన్ నిర్ణయం తీసుకుంటాడన్నారు. ఎన్నో ఏళ్లుగా శ్రమించిన మహీకి ఇప్పుడు ఆటను ఆస్వాదించే అవకాశం ఇవ్వాలన్నారు. జట్టు డిమాండ్ మేరకు అందరూ ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కోహ్లి టెస్టుల్లో అనుసరించిన ఐదుగురు బౌలర్ల వ్యూహం శాశ్వతమైంది కాదని, ప్రత్యర్థిని, మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇది మారుతుందన్నారు. తన పదవీ కాలంలో ఆసీస్ టూర్ చాలా బాగా జరిగిందని శాస్త్రి చెప్పారు.
కుర్రాళ్లు చాలా కఠినమైన పాఠాలను నేర్చుకున్నారన్నారు. భారత్ ‘ఎ’ జట్టు బాగా రాణిస్తుండటంతో సీనియర్ జట్టు రిజర్వ్ బెంచ్ సత్తా కూడా పెరిగిందన్నారు. ‘రిజర్వ్ బెంచ్ చాలా బాగా పుంజుకుంది. ‘ఎ’ జట్టు కోచ్ ద్రవిడ్‌తో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా. నైపుణ్యం ఉన్న కుర్రాళ్లను గుర్తించమని చెబుతున్నా. సరైన ఆటగాళ్లను గుర్తించే అనుభవం, ఆ స్థితి రాహుల్‌కు ఉంది. సీనియర్ జట్టుకు ఎవరు తొందరగా పనికి వస్తారనే విషయాన్ని అతను మాత్రమే గుర్తించగలడు’ అని శాస్త్రి వివరించారు.