క్రికెట్ `దేవుడి` వీడ్కోలు
నా జీవితం అంతా భారత్‌కు క్రికెట్ ఆడాలనే కలగన్నాను. గత 24 సంవత్సరాలుగా ప్రతిరోజూ ఇదే కలతో జీవిస్తున్నాను. క్రికెట్ లేకుండా నా జీవితాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే నాకు 11 ఏళ్ల వయసు నుంచి ఆటే జీవితంగా బతుకుతున్నాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే అవకాశం రావడం గొప్ప గౌరవం. సొంత గడ్డపై 200 టెస్టు కోసం ఎదురుచూస్తున్నాను. అదే నా ఆఖరి మ్యాచ్. వైదొలగడానికి ఇదే సరైన సమయం అని నా మనసు చెప్పినప్పుడు... దానికి అంగీకరించిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కుటుంబం ఎంతో సహనంతో, నన్ను అర్థం చేసుకుని ఇంతకాలం అండగా నిలిచింది. మైదానంలో నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వీళ్లందరికీ కృతజ్ఞతలు.
- సచిన్ టెండూల్కర్
కనిపిస్తే ఊపిరాడనివ్వకుండా గుమిగూడే అభిమానులు... ఎక్కడికెళ్లినా వెంటాడే మీడియా...
ఓ వైపు మ్యాచ్‌లు... మరోవైపు ప్రయాణాలు... ఖాళీ దొరికితే ప్రకటనలు, ఎండార్స్‌మెంట్లు...
వీటికి తోడు సేవా కార్యక్రమాలు... సాధారణ వ్యక్తిగా స్వేచ్ఛగా తిరగలేని బంధనాలు...
24 సంవత్సరాల పాటు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... ఇక కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.
ఇక ఎంతో కొంత స్వేచ్ఛగా తిరగొచ్చు. తన చివరి రెండు టెస్టుల్లోనూ మాస్టర్ అభిమానులను ఉర్రూతలూగించి... చివరిసారి దేశాన్ని మళ్లీ క్రికెట్ మత్తులో ముంచాలని కోరుకుందాం. రిటైర్‌మెంట్ తర్వాత సచిన్ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆశిద్దాం.
ముంబై: రికార్డుల రారాజు సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాడు. వెస్టిండీస్‌తో స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్ ద్వారా 200 టెస్టులు పూర్తి చేసుకోబోతున్న మాస్టర్... అదే తన చివరి మ్యాచ్ అని ప్రకటించాడు. ఇటీవల కాలంలో తన రిటైర్‌మెంట్ గురించి విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాస్టర్ అనూహ్యంగా బీసీసీఐ ద్వారా తన రిటైర్‌మెంట్ ప్రకటనను విడుదల చేశాడు.
గురువారం మధ్యాహ్నం... గం.3.35 నిమిషాలు... బీసీసీఐ నుంచి వచ్చిన మెయిల్ ఓ రకంగా ‘బాంబు’ పేల్చింది. సచిన్ టెండూల్కర్ బీసీసీఐ అధ్యక్షుడిని సంప్రదించి, రిటైర్‌మెంట్ ప్రకటన ఇచ్చాడని, దానిని విడుదల చేయమని బోర్డును కోరాడని పేర్కొంటూ బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏదో ఒక రోజు రిటైర్‌మెంట్ నిర్ణయం వస్తుందని తెలిసినా... ఇంత అనూహ్యంగా, అకస్మాత్తుగా సచిన్ ప్రకటించడం కాస్త ఆశ్చర్యకరమే.
ఆరేళ్ల క్రితమే అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు చెప్పిన మాస్టర్...
గత ఏడాది (2012) డిసెంబరు 23న వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ ద్వారా ఆఖరి టి20లు ఆడేసిన సచిన్... ఇక మిగిలిన ఒకే ఒక్క ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు చెప్పేశాడు. ఎలాంటి సంచలనాలు లేకుండా సాదాసీదాగా మాస్టర్ ప్రకటన ఉంది. వన్డేలకు వీడ్కోలు చెప్పినప్పుడు... పరోక్షంగా తనపై వస్తున్న విమర్శలను ప్రస్తావించిన సచిన్... ఈసారి మాత్రం అలాంటివేమీ పట్టించుకోలేదు. క్రికెట్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమంటూ... ఇన్నాళ్లూ తాను ఆటపై ఎంత ప్రేమతో బతికాడో చెప్పాడు.
ఈసారి అవకాశం...
వన్డేల విషయంలో సచిన్ ఘనమైన వీడ్కోలుకు అవకాశం లేకుండా రిటైర్‌మెంట్ ప్రకటన చేసినా... టెస్టుల విషయంలో మాత్రం కాస్త ముందే సమాచారమిచ్చాడు. మాస్టర్ ఆటను చివరిసారి మైదానంలో నేరుగా చూసే అవకాశం అభిమానులకు కల్పించాడు. ఇక మాస్టర్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వడానికి అటు బోర్డుకు, ఇటు అభిమానులకు కూడా అవకాశం దక్కింది.