అభిమాని కోసం సచిన్ లేఖ
లండన్: భారత్ ఆడే ప్రతి క్రికెట్ మ్యాచ్‌కు చేతిలో త్రివర్ణ పతాకాన్ని, ముఖంపై సచిన్ అని రాసుకొని అలరించే ఓ వ్యక్తి కనపిస్తూ ఉంటాడు. అతడే సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి. సచిన్ రిటైర్మెంట్ అనంతరం కూడా సుధీర్ భారత్ ఆడే మ్యాచ్‌ల్లో పాల్గొని ఆటగాళ్లను, అభిమానులను ఉత్సహపరుస్తూనే ఉన్నాడు.
చాంపియన్స్ ట్రోఫి కోసం భారత్ జట్టు ఇంగ్లండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారత జట్టుతో కలిసి సుధీర్ అక్కడికి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకోగా అతనికి వీసా రాలేదు. దీంతో భారత్- న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌కు సుధీర్ హాజరు కాలేకపోయాడు. తన వీరాభిమానికి వీసా దక్కలేదన్న విషయం తెలుసుకున్న సచిన్ స్పందించాడు. సుధీర్‌కు వీసా ఇవ్వాలని కోరుతూ లేఖ రాశాడు. సుధీర్ గొప్ప మద్దతుదారుడని, ఎలాంటి సహాయం లేకుండా ఎవరు అతనిలా మద్దతు తెలుపుతారని, సొంత ఖర్చులతో భారత జట్టుకు మద్దతు తెలిపాడని, అతను ఇంగ్లండ్ వెళ్లేందుకు వీసా మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు సచిన్ లేఖలో పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లతో సుధీర్ సచిన్ ఏబిలియన్ డ్రీమ్స్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన విషయం తెలిసిందే.