
మాస్టర్ బ్లాస్టర్ సచిన్
‘సచిన్ టెండుల్కర్’...పరిచయం అక్కరలేని పేరు. ఆటతోనే కాక వ్యక్తిత్వంతోను క్రికెట్ చరిత్రలో ధృవతారగా నిలిచాడు. ప్రపంచానికి దిగ్గజ క్రికెటర్ అయితే భారతీయులకు మాత్రం ‘క్రికెట్ దేవుడు’. ఈ మాస్టర్ బ్లాస్టర్ 2013లోనే అన్ని తరహాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికి, నేటికి అభిమానుల దృష్టిలో దైవంగానే పూజింపబడుతున్నాడు. సచిన్ ఈ మధ్యే ఒక చాట్ షోలో పాల్గొని, పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా మరోసారి తన గత అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
మైదానంలో ఉన్నప్పుడు ధోనిని అడిగి ఫీల్డింగ్ పోజిషన్‌కు సంబంధించిన సలహాలు, సూచనలను తీసుకునేవాడినని తెలిపారు. ఫీల్డింగ్ పోజిషన్ గురించి తన అభిప్రాయలను ధోనితో చెప్పి, వాటి గురించి అతని అభిప్రాయాన్ని తెలుసుకునేవాడినని అన్నారు. ఈ విషయాల గురించి ధోనితో చర్చిస్తున్న సందర్భంలోనే తనకు ధోనిలో జట్టును నడిపించే సామర్థ్యం ఉన్నట్టు అర్థమైదన్నారు. అందుకే తాను ధోనిని కెప్టెన్‌గా సూచించానన్నారు.
అలానే వెస్టిండీస్‌తో జరిగిన తన చివరి మ్యాచ్‌కు సంబంధించిన జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ ఆ మ్యాచ్‌ను చూడడానికి తొలిసారి తన అమ్మగారు స్టేడియానికి వచ్చారని తెలిపారు. ఆ సమయంలో ధోని తనను హడిల్ నుంచి దూరంగా ఉండమని కోరాడని, తనకు వీడ్కోలు ఇవ్వడానికి వారు ఏదో ప్లాన్ చేస్తున్నారనే విషయం తనకు అర్థమైందన్నారు. ఆ క్షణంలో తాను చాలా భావోద్వేగానికి గురయ్యానన్నారు.
కుటుంబ సభ్యులను చూస్తూ తాను ఆట మీద సరిగ్గా దృష్టి పెట్టలేనని అందుకే వారిని మ్యాచ్ చూడటానికి రమ్మని ఆహ్వానించనన్నారు. ఒక వేళ వారు వచ్చిన తనకు కనిపించకుండా ఉండమని చెప్తానన్నారు. 2003 - 04లో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌ను చూడటానికి తన భార్య అంజలి వచ్చిందని, ఆ సమయంలో తాను మొదటి బంతికే అవుటయ్యానని తెలిపారు. దాంతో అంజలి వెంటనే స్టేడియం నుంచి వెళ్లిపోయిందన్నారు. మళ్లీ తన చివరి మ్యాచ్‌ను చూడటానికే వచ్చిందని, మధ్యలో ఎప్పుడు తన మ్యాచ్‌లు చూడటానికి రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment