
‘మాస్టర్’ అనధికార క్రీడా మంత్రిగా ఉండాలి : పీటీ ఉష
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆట పరంగానే కాకుండా తన ప్రవర్తనతోనూ సమున్నతంగా ఎదిగాడని భారత అథ్లెట్ దిగ్గజం పీటీ ఉష పేర్కొన్నారు. పాతికేళ్లుగా కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా ఓ ఆటగాడు రాణించడమనేది మామూలు విషయం కాదని, అంత ఒత్తిడిని తట్టుకునే శక్తి మాస్టర్‌కు ఉండడం అద్భుతమని కొనియాడారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తను కెరీర్ నుంచి తప్పుకున్నాక ఇతర క్రీడల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. క్రీడలకు అనధికారిక మంత్రిగా వ్యవహరించాలని కోరుకున్నారు.
‘సచిన్.. ఓ బహుమతి లాంటివాడు. ఎంపీగా ఉన్న సచిన్ ఇతర క్రీడలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దిగ్గజ ఆటగాడి హోదాలో పతనావస్థలో ఉన్న చాలా ఆటలకు జీవం పోయాల్సిన బాధ్యత అతడిపై ఉంది. దీనికి అనధికారిక క్రీడా మంత్రిగా వ్యవహరించాలి. వివిధ క్రీడా సమాఖ్యలతో చర్చించి క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన మార్పులపై చర్చించాలి’ అని ఉష పేర్కొన్నారు.