
సచిన్ ఆధునిక బ్రాడ్‌మన్
సిడ్నీ: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత బ్రాడ్‌మన్ ఫౌండేషన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వాతో పాటు సచిన్‌ను ఈ గౌరవంతో సత్కరించారు. బుధవారం ఇక్కడ జరిగిన ప్రత్యేక డిన్నర్ కార్యక్రమంలో బ్రాడ్‌మన్ ఫౌండేషన్... సచిన్, స్టీవ్‌వా పేర్లను ఆనర్స్ బోర్డులో చేర్చింది.
ఈ సందర్భంగా ఎస్‌సీజీ ఎలెవన్, బ్రాడ్‌మన్ ఎలెవన్ జట్టు సభ్యులు ఇద్దరు దిగ్గజాలకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం విశేషం. పదహారేళ్ల క్రితం బ్రాడ్‌మన్‌ను కలిసిన క్షణాల గురించి కూడా సచిన్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో బ్రాడ్‌మన్‌తో తమకు ఉన్న అనుబంధంపై మాట్లాడిన మాస్టర్, వా తాము కలిసి ఆడిన రోజుల గురించి మాట్లాడారు.
ముఖ్యంగా స్టీవ్‌వా ఆఖరి టెస్టులో సచిన్ 241 పరుగులు చేయడం, డీప్ స్క్వేర్ లెగ్‌లో సచిన్ పట్టిన క్యాచ్‌తో వా వీడ్కోలు పలకడంవంటివి వారు చెప్పుకున్నారు. కఠిన పరిస్థితుల్లోనూ సమర్థంగా, క్రీడా స్ఫూర్తితో ఆడగల స్టీవ్‌వా చాంపియన్ క్రికెటర్ అని సచిన్ అభివర్ణించగా... సచిన్‌పై వా ప్రశంసలు కురిపించాడు. ‘అదో అద్భుతమైన ఇన్నింగ్స్.
అతని జోరు చూస్తే కనీసం అజేయంగా 400 పరుగులు చేస్తాడని అనిపించింది. బ్రాడ్‌మన్ పేరుతో ఏ రకంగానైనా నా పేరు జత కలవడం గొప్ప గౌరవం. అదీ ఈ రోజు ఆధునిక బ్రాడ్‌మన్ సచిన్‌తో కలిసి గౌరవాన్ని అందుకోవడాన్ని మించింది ఏముంటుంది’ అని స్టీవ్‌వా వ్యాఖ్యానించాడు.