Bradman
-
బ్రాడ్‌మన్ తర్వాత స్మిత్!
దుబాయ్: డాన్ బ్రాడ్‌మన్. దివంగత ఆస్ట్రేలియన్ దిగ్గజం. బ్యాటింగ్‌లో అయినా... రేటింగ్స్‌లో అయినా ఆయన తర్వాతే ఎవరైనా. కానీ ఇప్పుడు మాత్రం ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ రేటింగ్స్‌లో దూసుకెళ్తున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 945 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక రేటిం గ్ పాయింట్ల జాబితాలో అలనాటి దిగ్గజం తర్వాతి స్థానం స్మిత్‌దే కావడం విశేషం. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిన స్మిత్ ఆసీస్‌ను మరో రెండు మ్యాచ్‌లుండగానే విజేతగా నిలిపాడు. తాజా రేటింగ్ పాయింట్లతో అతను ఆల్‌టైమ్ గ్రే‘టెస్ట్’ బ్యాట్స్‌మెన్ జాబితాలో చేరిపోయాడు. ఇంగ్లండ్ గ్రేట్ లెన్ హటన్ (945) రికార్డును సమం చేసిన 28 ఏళ్ల స్మిత్... ఆస్ట్రేలియన్ ‘డాన్’కు కేవలం 16 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు. బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో ఎవరూ చేరనంత ఎత్తులో ఉండగా... ఇప్పుడు స్మిత్ సెంచరీ, డబుల్ సెంచరీలతో ఆ పీఠం చేరేందుకు అడుగులు వేస్తున్నాడు. సగటుల్లోనూ స్మిత్ (62.32) బ్రాడ్‌మన్ (99.94) తర్వాతి స్థానంలో ఉన్నప్పటికీ నూటికి చేరువగా ఉన్న ఆ దిగ్గజాన్ని అందుకోవడం కష్టమే! అయితే సెంచరీల్లో మాత్రం యథేచ్చగా దూసుకెళ్తున్నాడు. కెరీర్లో 59 టెస్టుల్లో 22 సెంచరీలు చేసిన స్మిత్... ఇందులో కెప్టెనయ్యాక చేసినవే 14 ఉన్నాయి. సారథిగా 29 టెస్టుల్లోనే ఈ 14 సెంచరీలు చేయడం విశేషం. -
శిఖర్‌ధావన్ మరో అరుదైన రికార్డు
సాక్షి, స్పోర్ట్స్: భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. భారత్- శ్రీలంకల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 168 బంతుల్లో 190 పరుగులు చేసి స్కోర్‌బోర్డును పరుగులెత్తించాడు. సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. బ్రాడ్‌మన్, వీరేంద్ర సెహ్వాగ్ సరసన చేరాడు. లంచ్ బ్రేక్ నుంచి టీ బ్రేక్ మధ్య రెండు సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఈ జాబితాలో మొదట సర్ డాన్ బ్రాడ్‌మన్, వీరేంద్ర సెహ్వాగ్ లు లంచ్ బ్రేక్, టీబ్రేక్ మధ్య రెండు సెంచరీలు చేశారు. 2012-13లో ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగన టెస్టు మ్యాచ్‌లో ధావన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో లంచ్, టీ బ్రేక్‌ల మధ్య 106 పరుగులు చేశాడు. అనంతరం బుధవారం శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. క్రికెట్ దిగ్గజం బ్రాడ్‌మన్ 1930,1934లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీలు చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2005-06లో పాకిస్తాన్ మీద 109 పరుగులు చేయగా, 2007-08లో దక్షిణాఫ్రికాతో చెన్నైలో జరిగిన టెస్టుమ్యాచ్‌లో 108 పరుగులు చేశాడు. -
సచిన్ ఆధునిక బ్రాడ్‌మన్
సిడ్నీ: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత బ్రాడ్‌మన్ ఫౌండేషన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్‌కు చోటు దక్కింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వాతో పాటు సచిన్‌ను ఈ గౌరవంతో సత్కరించారు. బుధవారం ఇక్కడ జరిగిన ప్రత్యేక డిన్నర్ కార్యక్రమంలో బ్రాడ్‌మన్ ఫౌండేషన్... సచిన్, స్టీవ్‌వా పేర్లను ఆనర్స్ బోర్డులో చేర్చింది. ఈ సందర్భంగా ఎస్సీజీ ఎలెవన్, బ్రాడ్‌మన్ ఎలెవన్ జట్టు సభ్యులు ఇద్దరు దిగ్గజాలకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం విశేషం. పదహారేళ్ల క్రితం బ్రాడ్‌మన్‌ను కలిసిన క్షణాల గురించి కూడా సచిన్ మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో బ్రాడ్‌మన్‌తో తమకు ఉన్న అనుబంధంపై మాట్లాడిన మాస్టర్, వా తాము కలిసి ఆడిన రోజుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా స్టీవ్‌వా ఆఖరి టెస్టులో సచిన్ 241 పరుగులు చేయడం, డీప్ స్క్వేర్ లెగ్‌లో సచిన్ పట్టిన క్యాచ్‌తో వా వీడ్కోలు పలకడంవంటివి వారు చెప్పుకున్నారు. కఠిన పరిస్థితుల్లోనూ సమర్థంగా, క్రీడా స్ఫూర్తితో ఆడగల స్టీవ్‌వా చాంపియన్ క్రికెటర్ అని సచిన్ అభివర్ణించగా... సచిన్‌పై వా ప్రశంసలు కురిపించాడు. ‘అదో అద్భుతమైన ఇన్నింగ్స్. అతని జోరు చూస్తే కనీసం అజేయంగా 400 పరుగులు చేస్తాడని అనిపించింది. బ్రాడ్‌మన్ పేరుతో ఏ రకంగానైనా నా పేరు జత కలవడం గొప్ప గౌరవం. అదీ ఈ రోజు ఆధునిక బ్రాడ్‌మన్ సచిన్‌తో కలిసి గౌరవాన్ని అందుకోవడాన్ని మించింది ఏముంటుంది’ అని స్టీవ్‌వా వ్యాఖ్యానించాడు. -
కలలు కంటే సరిపోదు...
1920... సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.. యాషెస్ టెస్టు మ్యాచ్.... 12 ఏళ్ల కుర్రాడు ఆ మ్యాచ్ చూస్తున్నాడు. మ్యాచ్ ముగిశాక అతడి తండ్రి వచ్చి ‘ఎలా ఉంది మ్యాచ్’ అని అడిగారు. ‘నాకేం సంతృప్తి లేదు. నేను ఆడితేనే నాకు తృప్తి’ అని ఆ బుడత జవాబిచ్చాడు. వెంటనే తండ్రి నవ్వారు... ‘కలలు కంటే సరిపోదు. కష్టపడాలి’ అని చెప్పారు. కట్ చేస్తే... ఆ కుర్రాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు బ్రాడ్‌మన్. ఒక్కసారిగా బ్రాడ్‌మన్ గొప్ప క్రికెటర్ కాలేదు. 12 ఏళ్ల వయసులో అందరికంటే భిన్నంగా ప్రాక్టీస్ చేసేవారు. గోల్ఫ్ బంతిని వాటర్ ట్యాంక్‌కేసి కొట్టేవారు. అది తిరిగి వేగంగా వచ్చే క్రమంలో వివిధ రకాల షాట్లు ఆడేవారు. బౌలర్ సాయం లేకుండా, కోచ్ అండ లేకుండా తనకు తానే ప్రాక్టీస్ చేసేవారు. ఈ శిక్షణ తన కెరీర్లో చాలా ఉపయోగపడింది. తొలిసారి క్రికెట్ ఆడే అవకాశం మాత్రం బ్రాడ్‌మన్‌కు గమ్మత్తుగా వచ్చింది. 12 ఏళ్లప్పుడు తన అంకుల్ కెప్టెన్‌గా ఉన్న బోరల్ జట్టుకు బ్రాడ్‌మన్ స్కోరర్‌గా పనిచేశాడు. ఒక ఆటగాడు తక్కువ కావడంతో ఆ జట్టులోకి వచ్చాడు. అరంగేట్రంలోనే 37, 29 స్కోర్లతో నాటౌట్‌గా నిలిచాడు. తదనంతరం అదే జట్టులో ఉంటూ డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడడంతో జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 1928లో తొలిసారి ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. బ్రాడ్‌మన్ ఆడినంత కాలం ఆసీస్ అజేయశక్తి. తన సంచలన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ‘బాడీలైన్’ బౌలింగ్‌ను కూడా ఇంగ్లండ్ ఆచరణలోకి తెచ్చింది బ్రాడ్‌మన్ జోరును ఆపడానికే. 99.96 సగటుతో కెరీర్‌ను ముగించిన బ్రాడ్‌మన్ రికార్డును భవిష్యత్‌లోనూ ఎవరూ అందుకోలేరనడం అతిశయోక్తి కాదు.