1920... సిడ్నీ క్రికెట్ గ్రౌండ్.. యాషెస్ టెస్టు మ్యాచ్.... 12 ఏళ్ల కుర్రాడు ఆ మ్యాచ్ చూస్తున్నాడు. మ్యాచ్ ముగిశాక అతడి తండ్రి వచ్చి ‘ఎలా ఉంది మ్యాచ్’ అని అడిగారు. ‘నాకేం సంతృప్తి లేదు. నేను ఆడితేనే నాకు తృప్తి’ అని ఆ బుడత జవాబిచ్చాడు. వెంటనే తండ్రి నవ్వారు... ‘కలలు కంటే సరిపోదు. కష్టపడాలి’ అని చెప్పారు. కట్ చేస్తే... ఆ కుర్రాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు బ్రాడ్‌మన్.
ఒక్కసారిగా బ్రాడ్‌మన్ గొప్ప క్రికెటర్ కాలేదు. 12 ఏళ్ల వయసులో అందరికంటే భిన్నంగా ప్రాక్టీస్ చేసేవారు. గోల్ఫ్ బంతిని వాటర్ ట్యాంక్‌కేసి కొట్టేవారు. అది తిరిగి వేగంగా వచ్చే క్రమంలో వివిధ రకాల షాట్లు ఆడేవారు. బౌలర్ సాయం లేకుండా, కోచ్ అండ లేకుండా తనకు తానే ప్రాక్టీస్ చేసేవారు. ఈ శిక్షణ తన కెరీర్‌లో చాలా ఉపయోగపడింది.
తొలిసారి క్రికెట్ ఆడే అవకాశం మాత్రం బ్రాడ్‌మన్‌కు గమ్మత్తుగా వచ్చింది. 12 ఏళ్లప్పుడు తన అంకుల్ కెప్టెన్‌గా ఉన్న బోరల్ జట్టుకు బ్రాడ్‌మన్ స్కోరర్‌గా పనిచేశాడు. ఒక ఆటగాడు తక్కువ కావడంతో ఆ జట్టులోకి వచ్చాడు. అరంగేట్రంలోనే 37, 29 స్కోర్లతో నాటౌట్‌గా నిలిచాడు. తదనంతరం అదే జట్టులో ఉంటూ డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడడంతో జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
1928లో తొలిసారి ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. బ్రాడ్‌మన్ ఆడినంత కాలం ఆసీస్ అజేయశక్తి. తన సంచలన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన ‘బాడీలైన్’ బౌలింగ్‌ను కూడా ఇంగ్లండ్ ఆచరణలోకి తెచ్చింది బ్రాడ్‌మన్ జోరును ఆపడానికే. 99.96 సగటుతో కెరీర్‌ను ముగించిన బ్రాడ్‌మన్ రికార్డును భవిష్యత్‌లోనూ ఎవరూ అందుకోలేరనడం అతిశయోక్తి కాదు.
కలలు కంటే సరిపోదు...
Published Fri, Feb 7 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement