
మీ మద్దతు మరువలేనిది
ముంబై: తన 24 ఏళ్ల కెరీర్‌కు మద్దతిచ్చిన కోట్లాది మంది అభిమానులకు భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కృతజ్ఞతలు చెప్పాడు. ‘నా క్షేమం కోరుతూ సుదీర్ఘ కెరీర్‌కు మద్దతిచ్చిన ప్రతి అభిమానికి చాలా రుణపడి ఉన్నాను.
ఈ సందర్భంగా వారందరికీ నా హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను’ అని ఇక్కడ జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న మాస్టర్ తెలిపాడు. నాలుగేళ్ల కిందట కుటుంబంతో కలిసి వెళ్లిన ఐస్‌లాండ్ పర్యటన మధురమైన అనుభూతినిచ్చిందని చెప్పాడు. ‘క్రికెట్‌కు దూరంగా కుటుంబంతో కలిసి ఐస్‌లాండ్‌కు వెళ్లా. ఆ టూరును ఇప్పటికీ మర్చిపోలేను. అక్కడి ప్రకృతి అద్భుతం, అమోఘం. క్రెడిట్ కార్డులు జేబుకే పరిమితమయ్యాయి.
ఎందుకంటే అక్కడ కొనేందుకు ఒక్క షాపు కూడా లేదు. అలాంటి ప్రదేశాలకు కుటుంబంతో కలిసి వెళ్లడం చాలా బాగుంటుంది. అందరు కలిసి మెలిసి పర్యటనను ఆస్వాదించొచ్చు. నాకు లభించిన ప్రత్యేకమైన విశ్రాంతి అదే’ అని సచిన్ వివరించాడు. క్రికెట్ వల్ల దేశం వెలుపలా, బయటా ఎన్నో ప్రదేశాలను చూసే అవకాశం తనకు లభించిందన్నాడు. భారత్‌లోనూ చూడటానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయని మాస్టర్ అన్నాడు.