
ప్రధానితో ‘సచిన్’ సినిమా విశేషాలు
న్యూఢిల్లీ: ఈనెల 26న విడుదల కానున్న ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బిజీగా గడుపుతున్నారు. దీంట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న ఆయన తన జీవిత చరిత్రపై వస్తున్న సినిమా గురించి వివరించారు. ‘ప్రధానిని కలుసుకుని సినిమా గురించి తెలపడం సంతోషంగా ఉంది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. వచ్చే తరానికి ఈ సినిమా ప్రేరణగా నిలవడమే కాకుండా కెరీర్‌లో నా ఒడిదుడుకుల గురించి కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.
దీనివల్ల సవాళ్లనేవి ఎక్కడైనా ఉంటాయని, వాటికి లొంగకుండా పైకి ఎదిగేందుకు ప్రయత్నించాలనే సందేశం ఇందులో ఉందని అన్నారు. ఈ సందర్భంగా నా గురించి ప్రత్యేకంగా ‘జో ఖేలే.. వహీ ఖిలే’ అని రాశారు. ఓ క్రీడాకారుడికి ఇది చాలా ఉత్తేజాన్నిచ్చే సందేశం. ఇది నిజంగా నా హృదయాన్ని తాకింది’ అని సచిన్ వివరించారు. మరోవైపు సచిన్‌తో జరిగిన భేటిని ప్రధాని మోదీ ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘సచిన్ జీవనయానం, సాధించిన విజయాలు ప్రతీ భారతీయుడు గర్వించేలా.. స్ఫూర్తి పొందేలా ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.