సాయికిరణ్‌కు కేసీఆర్ కేసరి టైటిల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేసరి రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఎంకేయూ గులాబ్ వ్యాయామశాలకు చెందిన రెజ్లర్లు సత్తాచాటారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో 75–100 కేజీ విభాగంలో రెండు పతకాలను సాధించారు. జె. సాయి కిరణ్ ఈ విభాగంలో విజేతగా నిలిచి ‘కేసీఆర్ కేసరి’ టైటిల్‌ను గెలుచుకోగా... జె. నర్సింగ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బామ్ అఖాడాకు చెందిన అబ్దుల్ రహీమ్ రెండోస్థానంతో సరిపెట్టుకున్నాడు.
మరోవైపు ‘యువ కేసరి’ టైటిల్‌ను సలే ఖులేఖి అఖాడాకు చెందిన జఫర్ బిన్ ముబారక్ గెలుచుకున్నాడు. 65–74 కేజీ విభాగంలో జరిగిన ఫైనల్లో జఫర్... టి. శివ సింగ్ (ఆర్‌పీసీ)ని ఓడించి విజేతగా నిలిచాడు. ఈ విభాగంలో జై భవాని వ్యాయామశాలకు చెందిన డి. సాయిదీప్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కె. స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహు మతులు ప్రదానం చేశారు. కేసీఆర్ కేసరి టైటిల్‌ను గెలుచుకున్న సాయికిరణ్‌కు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, యువకేసరి జఫర్‌కు పల్సర్ బైక్‌లు బహుమతులుగా లభించాయి. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, రాష్ట్ర రెజ్లింగ్ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు
50 కేజీ: 1. కె. కిషోర్, 2. శ్యామ్ సింగ్, 3. ఎం. శ్రీకాంత్. 57 కేజీ: 1. అబూబకర్ బిన్ అలీ, 2. ఎం. విక్రమ్, 3. ఇలియాస్. 61 కేజీ: 1. ఎస్. అక్షిత్ కుమార్, 2. హెచ్. ధన్‌రాజ్, 3. విజయ్ కుమార్. 66 కేజీ: 1. వినయ్ కుమార్, 2. జి. అక్షయ్ యాదవ్, 3. కె. ఎస్. రూప్‌లాల్. 84 కేజీ: 1. చందన్ సింగ్, 2. ఒమర్ బిన్ జావేద్ 3. ముజాహిద్. 120 కేజీ: 1. షేక్ మొహమ్మద్, 2. అబ్దుల్ వసీఫ్, 3. శాంతికుమార్.