18న నగరానికి సాయికిరణ్ మృతదేహం
* స్వదేశం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం
* సాయికిరణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం కేసీఆర్
* షాక్ నుంచి తేరుకోని సాయికిరణ్ తల్లిదండ్రులు
* కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ యువకుడు ఐలా సాయికిరణ్‌గౌడ్(23) మృతదేహం గురువారం(18వ తేదీన) నగరానికి చేరుకునే అవకాశం ఉంది. సాయికిరణ్ హత్యకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన మియామీ పోలీసులు.. అతడి మృతదేహాన్ని అక్కడి స్థానిక ఆస్పత్రిలో భద్రపరిచినట్లు సాయికిరణ్ స్నేహితుడు మనోజ్ ‘సాక్షి’కి తెలిపారు. సాయికిరణ్ మృతదేహం గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
సాయికిరణ్‌కు సంబంధించిన వివరాలను మనోజ్ ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా అతని తల్లిదండ్రులకు చేరవేస్తున్నారు. ఐఫోన్ కోసం పలువురు నల్లజాతి దుండగులు ఆదివారం సాయికిరణ్‌పై కాల్పులు జరపగా.. అతను అక్కడికక్కడే మృతిచెందిన సంగతి తెలి సిందే. మరోవైపు సాయికిరణ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తెప్పించేందుకు ఫ్లోరిడాలోని భారత రాయబార కార్యాలయం, కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శితో ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఫ్లోరిడా నుంచి సాయికిరణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తరలించేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా భారత రాయబార కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైర్‌లెస్ సందేశం పంపించారు.
ఇంకా షాక్‌లోనే సాయికిరణ్ తల్లిదండ్రులు
చేతికి ఎదిగొచ్చిన కొడుకును కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న సాయికిరణ్ తల్లిదండ్రులు. సాయికిరణ్ అమెరికాలో దారుణహత్యకు గురయ్యాడనే విషయంతో షాక్‌కు గురైన వారు ఇంకా తేరుకోలేదు. మరోవైపు దుఃఖసాగరంలో మునిగిపోయిన సాయికిరణ్ తల్లిదండ్రులు శ్రీహరిగౌడ్, రూపభవానీలను బంధువులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. సాయికిరణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. కాగా, తన కుమారుడి మృతదేహాన్ని త్వరగా స్వదేశం తీసుకురావాలని సాయికిరణ్ తండ్రి శ్రీహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
అమెరికాలో దారుణహత్యకు గురైన హైదరాబాద్ యువకుడు సాయికిరణ్ కుటుంబానికి సీఎం కె.చంద్రశేఖరరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువకుడిని తెలంగాణ రాష్ట్రం కోల్పోయిందన్నారు.