Saina Nehwal Confirms her Marriage with Parupalli Kashyap on December 16 - Sakshi
Sakshi News home page

పెళ్లి డేట్‌ కన్ఫామ్‌ చేసిన సైనా

Published Mon, Oct 8 2018 2:18 PM | Last Updated on Mon, Oct 8 2018 6:12 PM

Saina Nehwal Confirms Her Wedding To Parupalli Kashyap And Date Is December - Sakshi

సైనా నెహ్వాల్‌ - పారుపల్లి కశ్యప్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : గత కొన్ని రోజులుగా సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు  వినిపిస్తున్న సంగతి  తెలిసిందే. ఈ విషయం గురించి ఇన్ని రోజులు మౌనంగా ఉ‍న్నా సైనా తొలిసారి తమ బంధం గురించి మాట్లాడారు. తాను, కశ్యప్‌ ప్రేమించుకుంటున్నట్లు చెప్పడమే కాకా ఏకంగా పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 16న తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అదే రోజు పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని కూడా సైనా వివరించారు. దాంతో పాటు తమ ప్రేమ ప్రయాణం గురించి కూడా ఆసక్తికరం విషయాలను వెల్లడించారు.

ఈ విషయం గురించి సైనా ‘2005 నుంచి మేం గోపిచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాం. కానీ మా ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది 2007 లోనే. అప్పటి నుంచే మేం ఇద్దరం టోర్నీల కోసం కలిసి ప్రయాణించడం ప్రారంభించాం. ఎన్నో టోర్నిల్లో కలిసి ఆడాము, కలిసి శిక్షణ తీసుకున్నాం.. అలా మెల్లగా మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చారు సైనా నెహ్వాల్‌. అంతేకాక టోర్నీలతో చాలా బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ మాట్లాడుకోవడానికి తమకు అవకాశం దొరికేదని ఆమె తెలిపారు. అయితే  ఇన్నాళ్లు తమకు పెళ్లి ఆలోచన రాకపోవడానికి కారణం తాము ఎంచుకున్న కెరీర్లే అంటూ సైనా వివరించారు.

సైనా మాట్లాడుతూ.. ‘మా దృష్టిలో టోర్నీలు గెలవడం అన్నింటికన్నా చాలా ముఖ్యం. అందుకే మా దృష్టి వేరే విషయాల మీదకు మరలకుండా జాగ్రత్తపడ్డాం. చిన్న పిల్లలకు ఎంత కేర్ అవసరమో ప్లేయర్స్‌కు కూడా అంతే కేర్‌ అవసరం. ఇన్నాళ్లూ మా ఇంట్లో వాళ్లే అవన్నీ చూసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ విషయం మారుతుంది. నాపై బాధ్యత పెరుగుతుంది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ పూర్తయ్యే వరకు పెళ్లి ప్రస్తావన వద్దని అనుకున్నాం. ఇప్పుడు అందుకు సమయం వచ్చింది’ అని సైనా వివరించారు. తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా రాలేదని, వాళ్లే అర్థం చేసుకున్నారని ఆమె తెలిపారు.

అయితే ఈ ఏడాది డిసెంబర్ 16నే వివాహం చేసుకోవడం వెనక ఓ కారణం ఉందన్నారు.. డిసెంబర్ 20 తర్వాత మళ్లీ ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో బిజీ అవుతాము. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఉంటాయి. అందుకే ఆ లోపే పెళ్లి తంతు పూర్తి చేద్దామని అనుకున్నాం అని సైనా వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement