కాంస్యంతో సరి
వుహాన్ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ క్రీడాకారిణి, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో సైనా నెహ్వాల్ 16-21, 14-21 తేడాతో యిహాన్ వాంగ్(చైనా) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్ ఆరంభంలో 3-3,4-4, 6-5 తేడాతో ముందంజలో పయనించిన సైనా ఆ తరువాత అనూహ్యాంగా వెనుకబడి ఆ గేమ్ ను కోల్పోయింది. ఆపై రెండో గేమ్ ఆదిలో తీవ్ర ఒత్తిడికి లోనై 5-13 తేడాతో వెనుకబడింది. ఏ దదశలోనూ ప్రత్యర్థి ఎత్తులకు అడ్డుకట్టవేయలేకపోయిన సైనా రెండో గేమ్ ను కూడా కోల్పోయి టోర్నీ నుంచి భారంగా నిష్ర్రమించింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించి పతకం ఖాయం చేసుకున్న సైనా ..ఈ మెగా ఈవెంట్లో సెమీస్ కు చేరడం ద్వారా రెండుసార్లు పతకం సాధించిన క్రీడాకారిణి గుర్తింపుపొందిన సంగతి తెలిసిందే. కాగా, సెమీస్ లో అంచనాలను అందుకోలేకపోయిన సైనా పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైంది.