సైనా ముందుకు... సింధు ఇంటికి
► భారత స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు
► ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
వుహాన్ (చైనా): మరోసారి నిలకడగా రాణించిన భారత స్టార్ సైనా నెహ్వాల్ ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి పీవీ సింధు తీవ్రంగా పోరాడినా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21-14, 21-18తో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నిచావోన్‌పై సైనాకిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. మరోవైపు ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ సింధు చేజేతులా ఓడిపోయింది.
గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-13, 20-22, 8-21తో పరాజయం పాలైంది. తొలి గేమ్‌ను నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి రెండో గేమ్‌లో 12-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 20-19తో విజయం అంచుల్లో నిలిచింది. అయితే కీలకదశలో తప్పిదాలు చేసి రెండో గేమ్‌ను కోల్పోయిన సింధు... మూడో గేమ్‌లో మాత్రం పట్టు కోల్పోయింది. ఆరంభంలోనే 0-8తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో షిజియాన్ వాంగ్ (చైనా)తో సైనా తలపడుతుంది.