
జకార్తా: ఈ ఏడాది తాము ఆడుతోన్న తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ఇండోనేసియా మాస్టర్స్ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరు హైదరాబాద్ అమ్మాయిలు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 21–12, 21–9తో ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ గో జిన్ వె (మలేసియా)ను ఓడించగా... ప్రపంచ 12వ ర్యాంకర్ సైనా 21–12, 21–18తో ప్రపంచ 20వ ర్యాంకర్ చెన్ జియోజిన్ (చైనా)పై గెలుపొందింది.
అంతర్జాతీయ స్థాయిలో సైనా, సింధు ముఖాముఖిగా రెండుసార్లు తలపడగా... చెరో మ్యాచ్‌లో గెలిచి సమఉజ్జీగా ఉన్నారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.