
సాకేత్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. కజకిస్తాన్‌లోని అస్తానాలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో క్వాలిఫయర్ సాకేత్ 0–6, 4–6తో నాలుగో సీడ్ డక్‌హీ లీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.
ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ (భారత్)–మత్సుయి (జపాన్) జోడీ 6–7 (3/7), 6–4, 10–8తో నికోలా మిలోజెవిచ్ (సెర్బియా)–ఆల్డిన్ సెట్‌కిక్ (బోస్నియా హెర్జెగోవినా) జంటపై గెలిచి సెమీస్‌కు చేరింది.