ఒలింపిక్స్‌కు మేటి జంటను పంపలేకపోయారు
న్యూఢిల్లీ: గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ యువ సంచలనం సాకేత్ మైనేని ఆటతీరును ఆకాశానికెత్తాడు. అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని కితాబిచ్చాడు. ‘రియో, గత లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదు. దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ ఒలింపిక్స్‌లో మంచి మిక్స్‌డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నాం.
గత 14 నెలల్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ టైటిల్స్‌ను సాధించిన నన్ను కాదని మరో ఆటగాడిని రియోకు పంపడం ఏమాత్రం సమంజసంగా లేదు’ అని అన్నాడు. సానియాకు జతగా రోహన్ బోపన్న బరిలోకి దిగగా ఈ జోడి సెమీఫైనల్‌తోపాటు కాంస్య పతక పోరులో ఓడింది. ప్రస్తుత డేవిస్ కప్ టీమ్ ఈవెంట్‌లో సాకేత్ మైనేనిలాంటి ఆటగాడితో జతకట్టడం బాగుందని పేస్ అన్నాడు. ఈ జోడీ... రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జోడి చేతిలో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. ‘మైనేని సర్వీస్ అద్భుతం. రిటర్న్ షాట్లు అసాధారణం. కెరీర్ తొలినాళ్లలోనే అతను చక్కని ఆటతీరుతో ఆదరగొడుతున్నాడు. అనుభవం సంతరించుకుంటే భారత టెన్నిస్ మేటి ఆటగాడిగా ఎదుగుతాడు’ అని తెలుగు కుర్రాడిని ప్రశంసలతో ముంచెత్తాడు.
మనకు మరో 18 నెలల్లో ఆసియా గేమ్స్, నాలుగేళ్లకు టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే డబుల్స్‌లో ఎవరు, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎవరెవరు ఆడతారనే స్పష్టతతో ముందడుగు వేయాలని అఖిల భారత టెన్నిస్ సంఘాని (ఐటా)కి సూచించాడు. దీంతో చివరి నిమిషంలో అనవసరపు గందరగోళానికి తావుండదని చెప్పాడు. మరోవైపు ‘సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడంతో సమానం’ అని పరోక్షంగా పేస్‌ను ఉద్దేశించి సానియా మీర్జా వ్యాఖ్యానించడం విశేషం.