చెన్నై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేని భారత డేవిస్ కప్ జట్టులోకి పునరాగమనం చేశాడు. పాకిస్తాన్‌తో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ కోసం రోహిత్ రాజ్‌పాల్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. సింగిల్స్ విభాగంలో భారత టాప్ ఆటగాళ్లయిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లను ఎంపిక చేశారు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంటను ఎంపిక చేసింది. గతవారం చైనాలో జరిగిన చెంగ్డూ చాలెంజర్ టూర్ సిరీస్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను గెలిచిన సాకేత్ మైనేనికి కూడా స్థానం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీతో కోల్‌కతాలో జరిగిన వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో సాకేత్ ఆడలేదు. గతేడాది సెప్టెంబర్‌లో సెర్బియాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చివరిసారి సాకేత్ బరిలోకి దిగాడు. డేవిస్ కప్‌లో భారత్–పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు 6 సార్లు తలపడగా అన్నింటిలోనూ భారతే విజయం సాధించింది. ఇస్లామాబాద్ వేదికగా సెప్టెంబర్ 14, 15 తేదీల్లో డేవిస్ కప్ పోరులో మరోసారి భారత్–పాకిస్తాన్‌లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment