మహేశ్ భూపతితో జతగా సాకేత్
* చెన్నై ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’ కేటాయింపు
* జనవరి 5 నుంచి టోర్నీ
చెన్నై: అంతర్జాతీయస్థాయిలో ఈ ఏడాది నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేనికి చెన్నై ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’ లభించింది. వచ్చే నెల జనవరి 5 నుంచి చెన్నైలో జరిగే ఈ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ దిగ్గజం మహేశ్ భూపతితో కలిసి సాకేత్ మైనేని బరిలోకి దిగనున్నాడు. వైజాగ్‌కు చెందిన 27 ఏళ్ల సాకేత్ ఈ సంవత్సరం భారత డేవిస్ కప్ జట్టులో చోటు సంపాదించడంతోపాటు ఆసియా క్రీడల్లో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, సనమ్ సింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు.
డబుల్స్ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్ 154కు చేరుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో మియామి మాస్టర్స్ సిరీస్ తర్వాత భూపతి మరో టోర్నీలో బరిలోకి దిగలేదు. చెన్నై ఓపెన్‌తో అతను కొత్త ఏడాదిని ప్రారంభించనున్నాడు. సాకేత్, భూపతిలతో పాటు భారత్‌కే చెందిన జీవన్ నెదున్‌చెజియాన్, శ్రీరామ్ బాలాజీలకు కూడా డబుల్స్ విభాగంలో ‘వైల్డ్ కార్డు’ను కేటాయిస్తున్నట్లు టోర్నీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కార్తీ చిదంబరం తెలిపారు. సింగిల్స్‌లో సోమ్‌దేవ్, రామ్‌కుమార్ రామనాథన్‌లకు కూడా ‘వైల్డ్ కార్డు’ ఇచ్చారు.