ధోనీ, సామ్యూల్స్.. ఇది సరికాదు గురూ!
కోల్‌కతా: ఆట అన్నాక కొన్నిసార్లు ఆనందం.. కొన్నిసార్లు నిర్వేదం సహజమే. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఓ అంతర్జాతీయ ఆటగాడిగా భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని.. హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత క్రికెటర్‌పై ఉంటుంది. వారి ప్రవర్తన హుందాగా ఉంటేనే ఈ జెంటల్మెన్ గేమ్‌కు వన్నె తెస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలనుకుంటున్న యువతకు స్ఫూర్తిన్నిస్తుంది. కానీ టీ20 వరల్ కప్ సందర్భంగా భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ సామ్యూల్స్ మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు విమర్శలకు గురైంది. హుందాగా నడుచుకోవాల్సిన ఆటగాళ్లు అథమంగా ప్రవర్తించారనే విమర్శలు వినిపించాయి.
సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన తర్వాత ఓ ఆస్ట్రేలియా జర్నలిస్టుతో ధోనీ చాలా చిత్రంగా ప్రవర్తించాడు. తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించిన సామ్యూల్ ఫెర్రిస్‌తో 'వికెట్ కీపరైన కొడుకుగానీ, తమ్ముడుగానీ నీకు ఉన్నారా? నేను రిటైరవ్వడం వల్ల వారికేమైనా లబ్ధి చేకూరుతుందా' అంటూ ప్రశ్నించాడు. ఇదే ప్రశ్న భారతీయ విలేకరి అడుగుతాడని తాను అనుకున్నట్టు చెప్పాడు. ఆ విలేకరిని తన పక్కన కూచొబెట్టుకొని ప్రశ్నలు అడిగాడు. ఇది ఒకరకంగా తనకు నచ్చిన ప్రశ్నలు అడిగినందుకు అసహనం చూపడమే. దీనిపై ఫెర్రిస్ స్పందిస్తూ తన సహచర భారతీయ జర్నలిస్టుల తరఫున ఈసారి తాను ధోనీ కోపాన్ని చవిచూసినట్టు చెప్పాడు. అతడి ధోరణిని తప్పుబట్టాడు.
ఇక ఫైనల్ మ్యాచ్‌లో 66 బంతుల్లో 85 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గెలుచుకున్న వెస్టిండీస్ ఆటగాడు మార్లన్ సామ్యూల్స్ ఇంకా అహంభావాన్ని ప్రదర్శించాడు. విలేకరులతో మాట్లాడుతూ ఇటు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్, అటు ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్‌పై విమర్శలు గుప్పించిన అతను.. మీడియా మైకులు పెట్టే బల్లపై కాలు మీద కాలు ఉంచి దర్జాగా తానే బాస్ అన్న రీతిలో మాట్లాడాడు. టీవీ మైకులకు అతని కాళ్లు తాకుతున్నా.. అదేమీ పట్టించుకోకుండా దర్జా ఒలుకబోశాడు. అతని ప్రవర్తన మీడియా మిత్రులకు కొద్దిగా ఇబ్బంది కల్పించాడు. సామ్యూల్స్ ధోరణి, ధోనీ అసంబద్ధమైన ప్రశ్నలు మీడియాను అగౌరవపరిచేవనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.