విజయంతో ఒకరు.. పరాజయంతో మరొకరు
ప్రపంచ క్రికెట్లో ఇద్దరు యోధుల శకం ముగిసింది. అత్యుత్తమ కెప్టెన్గా, బాట్స్మన్గా మన్నలందుకున్న ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. నిన్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్.. ఈ రోజు శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర. తమ చివరి టెస్టు మ్యాచ్లో క్లార్క్ విజయంతో.. సంగా పరాజయంతో నిష్ర్కమించారు. చివరి మ్యాచ్ ఫలితాలను పక్కనబెడితే.. ఈ ఇద్దరూ తమ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్గా, బ్యాట్స్మన్గా చెరగని ముద్ర వేశారు. చివరి మ్యాచ్లో ఈ ఇద్దరూ దిగ్గజాలకు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో స్వాగతం పలికారు. ఇంతకుముందే పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి వైదొలిగిన సంగా, క్లార్క్లు.. టెస్టు క్రికెట్లోనూ బ్యాట్ను పక్కనపెట్టేశారు. కాకతాళీయమే అయినా అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకేసారి వీడ్కోలు చెప్పేశారు.
పోరాట యోధుడు సంగా: సంగా ఒక పరుగుల యంత్రం. 38 ఏళ్ల సంగా దశాబ్దమన్నర కాలంగా శ్రీలంక క్రికెట్‌కు వెన్నె ముకగా నిలిచాడు. 134 టెస్టుల్లో 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 38 సెంచరీల్లో 11 డబుల్ సెంచరీలుగా మలచడం విశేషం. ఇక 404 వన్డేల్లో 14,234 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల జాబితాలో అతను ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్ (15921) అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘకాలంపాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. మహేళ జయవర్ధనేతో కలిసి ఎన్నో రికార్డు భాగస్వామ్యాలు కూడా నెలకొల్పాడు. తన కెరీర్‌లో ఒక టి20 ప్రపంచకప్ గెలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండు ఫైనల్స్ ఆడినా టైటిల్ లేకపోవడం కెరీర్‌లో లోటు. వన్డేల నుంచి తప్పుకునే ముందు చివరి ఐదు ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు.
మేటి సారథి మైకేల్ క్లార్క్: అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాక స్వల్ప కాలంలోనే క్లార్క్ తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. 12 ఏళ్ల పాటు జట్టుకు సేవలందించాడు. 34 ఏళ్ల క్లార్క్ 115 టెస్టుల్లో 8643 పరుగులు చేశారు. ఇందులో 28 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 329 (నాటౌట్). ఇక 245 వన్డేలాడిన క్లార్క్ 7981 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్లార్క్ తన కెరీర్లో రెండు వన్డే ప్రపంచకప్‌లు, రెండు యాషెస్ సిరీస్ విజయాల్లో భాగస్వామి అయ్యాడు. పాంటింగ్ తర్వాత ఆసీస్ సారథిగా బాధ్యతలు తీసుకున్న క్లార్క్.. సొంతగడ్డపై ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ను అందుకోవడం తన కెరీర్‌లో అత్యంత మధుర క్షణం.