సానియా-హింగిస్ జంటకు షాక్
మూడో రౌండ్‌లో ఓడిన టాప్ సీడ్ జోడీ క్వార్టర్స్‌లో ముర్రే , వావ్రింకా
పారిస్: వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఊహించని షాక్ ఎదురైంది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్... ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీకి ఫ్రెంచ్ ఓపెన్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 3-6, 2-6తో క్రెజ్‌సికోవా-సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-కుద్రయెత్సెవా (రష్యా) జంట 6-2, 3-6, 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)-హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
పురుషుల డబుల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలండ్) 7-6 (7/5), 7-6 (7/4)తో జేమీ ముర్రే (బ్రిటన్)-బ్రూనో సొరెస్ (బ్రెజిల్)లపై... రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) 6-2, 6-7 (4/7), 6-1తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్)లపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 7-6 (11/9), 6-4, 6-3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7-6 (7/5), 6-7 (7/9), 6-3, 6-2తో ట్రయెస్కీ (సెర్బియా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మరో మ్యాచ్‌లో అన్‌సీడెడ్ అల్బెర్ట్ రామోస్ (స్పెయిన్) 6-2, 6-4, 6-4తో తొమ్మిదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై సంచలన విజయం సాధించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-3, 6-4తో స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా)పై, షెల్బీ రోజర్స్ (అమెరికా) 6-3, 6-4తో ఇరీనా బేగూ (రుమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.