
సానియా-హింగిస్ జోడికి ఐటీఎఫ్ అవార్డు
లండన్:ఈ ఏడాది మహిళల డబుల్స్ విభాగంలో అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) వరల్డ్ చాంపియన్స్ అవార్డును భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మహిళల మాజీ నెంబరవన్ మార్టినా హింగిస్(స్విట్టర్లాండ్)ల జోడి గెలుచుకుంది. 2015 మార్చిలో జత కట్టిన వీరిద్దరూ విశేషంగా రాణించి మొత్తం తొమ్మిది టైటిల్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇందులో రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కూడా ఉన్నాయి. మొత్తం 61 గేమ్‌లు నెగ్గిన ఈ జోడీ ప్రత్యర్థులకు కేవలం 31 గేమ్‌లను సమర్పించుకుంది. వరుసగా 22 మ్యాచ్‌లను సానియా జోడీ గెలుచుకోవడం విశేషం. దీంతో ఊహించినట్లుగానే ప్రతిష్టాత్మక ఐటీఎఫ్ అవార్డుకు ఈ జోడీ ఎంపికైంది. కాగా, 2000లో మహిళల సింగిల్స్ విభాగంలో తొలిసారి ఐటీఎఫ్ అవార్డును మార్టినా హింగిస్ గెలుచుకుంది.
ఐటీఎఫ్ అవార్డును గెలుచుకోవడం పట్ల సానియా ఆనందం వ్యక్తం చేసింది. 'ఈ సంవత్సరం మాకు చాలా సంతృప్తిని మిగిల్చింది. అనుకున్నదాని కంటే చాలా సాధించాం. ఐటీఎఫ్ అవార్డును స్వీకరించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. నా సక్సెస్ భారత్ లో చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది'అని సానియా పేర్కొంది.