♦ హింగిస్‌తో కలిసి మియామి ఓపెన్ టైటిల్ కైవసం
♦ రూ. కోటీ 83 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
ఫ్లోరిడా (అమెరికా) : కొత్త భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సమన్వయం అద్భుత ఫలితాలను ఇస్తోంది. రెండు వారాల క్రితం జతగా బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ ద్వయం మియామి ఓపెన్‌లోనూ మెరిసింది. డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లోని ప్రీమియర్ టోర్నీల్లో ఒకటైన మియామి ఓపెన్‌లో సానియా-హింగిస్ జంట చాంపియన్‌గా అవతరించింది.
భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 7-5, 6-1తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన సానియా జంటకు 2,95,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 83 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా సానియా కెరీర్‌లో ఇది 25వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌కు 43వ డబుల్స్ టైటిల్. సింగిల్స్ విభాగంలోనూ హింగిస్ ఖాతాలో 43 టైటిల్స్ ఉండటం విశేషం.
66 నిమిషాలపాటు జరిగిన మియామి ఫైనల్లో సానియా జంటకు తొలి సెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒకదశలో ఈ ఇండో-స్విస్ జోడీ 2-5తో వెనుకబడింది. అయితే కోర్టులో అద్భుత సమన్వయంతో కదులుతూ, అందివచ్చిన బ్రేక్ పాయింట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సానియా-హింగిస్ జంట వరుసగా ఐదు గేమ్‌లు నెగ్గి తొలి సెట్‌ను కైవసం చేసుకుంది.
తొలి సెట్‌ను గెల్చుకునే దశ నుంచి కోల్పోయిన మకరోవా-వెస్నినా జంట రెండో సెట్‌లో డీలా పడింది. రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి ఇక తేరుకోలేకపోయింది. ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో మాదిరిగానే ఈ టోర్నీలోనూ సానియా-హింగిస్ జంట తమ ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ నెగ్గడం విశేషం.
నేను రెండు విషయాల గురించి చాలా కాలంగా కలగంటున్నాను. మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ నెగ్గడం, ప్రపంచ నంబర్‌వన్ కావడం. ఇప్పుడు నంబర్‌వన్‌కు చాలా దగ్గరలో ఉన్నాను. ఈ సమయంలో దాని గురించి పట్టించుకోననే మాట నేను చెప్పను. ఎందుకంటే నేనూ సాధారణ మానవమాత్రురాలినే. ప్రతీ మ్యాచ్‌లో టాప్ ర్యాంక్ గురించి ఆలోచిస్తున్నాను. త్వరలో దక్కుతుందని ఆశిస్తున్నాను కూడా. గత రెండేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నా. అదే కొనసాగిస్తా. ఈ సీజన్ మొత్తం హింగిస్‌తో కలిసి ఆడాలని నిర్ణయించుకున్నాను. -సానియా
వరుసగా రెండు ప్రీమియర్ టైటిల్స్ సాధించడంతో... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు మరింత చేరువైంది. సోమవారం అమెరికాలోని చార్ల్స్‌టన్‌లో మొదలైన ‘ఫ్యామిలీ సర్కిల్ కప్’లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సానియా జంట ఈ టోర్నీలోనూ విజేతగా నిలిస్తే... ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సానియా సొంతమవుతుంది. ప్రస్తుతం సారా ఎరాని, రొబెర్టా విన్సీ ఇద్దరూ 7640 పాయింట్లతో సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో ఉన్నారు. సానియా మూడో ర్యాంక్‌లో (7495 పాయింట్లతో) ఉంది.
వారెవ్వా... సానియా
Published Mon, Apr 6 2015 11:42 PM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM
Advertisement
Advertisement