ఐదో టైటిల్‌కు అడుగు దూరంలో...
మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో సానియా జోడి
మాడ్రిడ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 6-2, 6-0తో వానియా కింగ్ (అమెరికా)-అల్లా కుద్రెత్సోవా (రష్యా)లపై గెలిచారు. దీంతో ఈ సీజన్లో ఐదో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. స్టట్గర్ట్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న సానియా ద్వయానికి వరుసగా ఇది రెండో ఫైనల్. కేవలం 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టింది.
వీళ్ల దాటికి తొలిసెట్లో ప్రత్యర్థులు ఒక్కసారి కూడా సర్వీస్ నిలబెట్టుకోలేకపోయారు. సానియా ద్వయం రెండుసార్లు సర్వీస్‌ను కోల్పోవడంతో కింగ్-అల్లా జంటకు రెండు పాయింట్లు దక్కాయి. రెండోసెట్లో రెండు, నాలుగో గేమ్‌లో ప్రత్యర్థుల సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ 4-0 ఆధిక్యంలో నిలిచారు. ఆ తర్వాత కూడా అదే జోరుతో సెట్, మ్యాచ్‌ను చేజిక్కించుకున్నారు. ఈ సీజన్లో సానియా ఖాతాలో సిడ్నీ, బ్రిస్బేన్, ఆస్ట్రేలియన్, సెయింట్ పీటర్స్బర్గ్ టైటిల్స్ ఉన్నాయి. శనివారం జరిగే ఫైనల్లో సానియా-హింగిస్... ఐదోసీడ్ కరోలినా గార్సియా-క్రిస్టినా మల్డోనోవిచ్లతో తలపడతారు.