న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ డబుల్స్‌లో మెరుపులు మెరిపిస్తున్న తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ కామన్వెల్త్ క్రీడల్లో పతకంపై కన్నేశాడు. ఏప్రిల్‌లో గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగనున్న ఈ మెగా ఈవెంట్‌లో తొలిసారి చిరాగ్ శెట్టితో కలిసి బరిలో దిగుతున్న 17 ఏళ్ల సాత్విక్ డబుల్స్‌లో పతకం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనాలనేది మా నాన్న కల. ఈ క్రీడలకు ఎంపికైన విషయం తెలియగానే చాలా సంతోషం కలిగింది. మెగా ఈవెంట్‌లో పతకం సాధిస్తామనే నమ్మకం ఉంది. గత ఆరు నెలలుగా మేం మంచి ప్రదర్శన చేస్తున్నాం. దీన్ని గోల్డ్‌కోస్ట్‌లోనూ కొనసాగిస్తాం’ అని తెలిపాడు.
మరో ఆటగాడు చిరాగ్ శెట్టి మాట్లాడుతూ... ‘ఇప్పటివరకు భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ కామన్వెల్త్ క్రీడల్లో పతకం నెగ్గలేదు. ప్రస్తుతం మా పూల్‌లో ఇంగ్లండ్, మలేసియాకు చెందిన హేమాహేమీల్లాంటి ఆటగాళ్లున్నారు. ప్రత్యర్థులు మాకంటే మెరుగ్గా ఉన్నా వంద శాతం శ్రమించి అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం’ అని అన్నాడు. చిరాగ్‌తో జోడీ కట్టిన తొలినాళ్లలో చాలా కష్టంగా ఉండేదని... కానీ ఇప్పుడు తమ జంట అద్భుతంగా రాణిస్తోందని సాత్విక్ అన్నాడు. ‘చిరాగ్‌తో జత కట్టిన మొదట్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని సార్లు ఎవరు ముందు ఆడాలి, ఎవరు వెనుక అనే విషయంలో కూడా స్పష్టత లోపించేది. ఇద్దరి మధ్య సమన్వయం కుదిరేది కాదు. కానీ ఇప్పుడు మేం మంచి మిత్రులయ్యాం. ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం ద్వారా ఆట కూడా మెరుగైంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు’ అని సాత్విక్ పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో ఈ జంట సెమీఫైనల్‌కు చేరింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లోనూ మంచి ప్రదర్శన చేసినా క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. ఈ ఏడాది చివరికల్లా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్–15కు చేరడమే తమ లక్ష్యమని ఈ జోడీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment