బెంగళూరు: బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం తన లక్ష్యం కాదని దాని కంటే మ్యాచ్‌లు గెలవడమే తనకు ముఖ్యమని అంటున్నాడు. ‘నా దృష్టి ఎప్పుడూ మ్యాచ్‌లు గెలవడంపైనే ఉంటుంది. ట్రిపుల్ సెంచరీలాంటి లక్ష్యాలేమి నాకు లేవు. అవి ఇతరుల లక్ష్యాలు’ అని కోహ్లి అన్నాడు. ఒత్తిడిలో రాణించడాన్ని అమితంగా ఆస్వాదించే కోహ్లి పరీక్షల ముందు విద్యార్థులపై ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతూ... ‘బోర్డు పరీక్షలు రాసే సమయంలో నేను కూడా కొంత విరామం తీసుకొని ఆటలకు కేటాయించేవాడిని.
ఒత్తిడిని తగ్గించడంలో అవి ఎంతో తోడ్పడేవి. మానసిక ఉల్లాసంతో పాటు సానుకూల దృక్పథం పెరగడంలో ఆటల పాత్ర చాలా ముఖ్యమైనది. దీంతో తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టగలిగేవాడిని. విజయాలు మనకు ఏమి నేర్పవు. పరాజయాలే పాఠాలు చెప్తాయి. కష్ట కాలంలోనే మనలోని నైపుణ్యాలకు పనిపెడతాం’ అని పేర్కొన్నాడు. తొలి సారి భారత జట్టులో చోటు దక్కిన రోజులను గుర్తు చేసుకుంటూ... ‘టీమిండియాకు ఎంపికైన సమయంలో అమ్మతో కలిసి టీవీ చూస్తున్నా. ఫ్లాష్ న్యూస్‌లో నా పేరు చూసి తప్పుడు ప్రచారమేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత బోర్డు నుంచి ఫోన్ రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment