ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన రోజు నుంచి భారత జట్టు ఎదురు లేకుండా సాగిపోతోంది. ఐర్లాండ్‌పై టి20 సిరీస్ విజయం, ఆ తర్వాత ఇంగ్లండ్‌పై కూడా టి20 సిరీస్ గెలుపు, ఇక తొలి వన్డేలో ఘన విజయం. మరొక్క మ్యాచ్‌లో ఇదే జోరు కొనసాగిస్తే అసలైన టెస్టు సిరీస్‌కు ముందు అంబరమంత స్థాయిలో ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి.
లండన్: వన్డే క్రికెట్‌లోని టాప్–2 జట్లలో ఎవరి సత్తా ఏమిటో తొలి మ్యాచ్‌లో కనిపించింది. ఇంగ్లండ్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు మరో విజయం సాధించి వరుసగా ఏడో వన్డే సిరీస్‌ను గెలుచుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు సొంతగడ్డపై పరువు కాపాడుకునే క్రమంలో కచ్చితంగా మ్యాచ్ నెగ్గాల్సిన స్థితిలో మోర్గాన్ సేన నిలిచింది. ఈ నేపథ్యంలో నేడు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి.
అదే జట్టుతో...
తొలి వన్డేలో అద్భుత విజయం తర్వాత భారత్ ఇక్కడా అదే జట్టును కొనసాగించడం దాదాపుగా ఖాయం. అయితే పేస్ బౌలర్లలో భువనేశ్వర్ గాయం నుంచి కోలుకుంటే సిద్ధార్థ్ కౌల్ స్థానంలో బరిలోకి దిగుతాడు. కుల్దీప్, చహల్ మరో సారి ప్రత్యర్థి పని పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ ఫామ్‌లోకి వచ్చాడు. రోహిత్ తిరుగులేని ఆటను ప్రదర్శిస్తుండగా, కోహ్లి ఆట గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాని సురేశ్ రైనా, ధోని, హార్దిక్ పాండ్యా ఈసారి చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు.
కుల్దీప్‌ను ఆడగలరా...
వన్డేల్లో రికార్డు విజయాలతో ఊపు మీద కనిపించిన ఇంగ్లండ్ ఒక్కసారిగా భారత్ దెబ్బకు నేలకు దిగొచ్చింది. తమ స్పిన్ బలహీనతను ఆ జట్టు బయట పెట్టుకుంది. ముఖ్యంగా కుల్దీప్ వేస్తున్న ఏ బంతి ఎటు వెళుతుందో అర్థం కాని స్థితిలో జట్టు బ్యాట్స్‌మెన్ నిలిచారు. పేస్ బౌలిం గ్‌లో ఆరంభంలో రాయ్, బెయిర్‌స్టో వేగంగా పరుగులు సాధిస్తున్నా, స్పిన్నర్లు రాగానే అంతా మారిపోతోంది. రూట్ వైఫల్యం జట్టును కలవరపరిచే అంశం. రెండో టి20 తరహాలో కుల్దీప్‌ను జాగ్రత్తగా ఆడగలిగితే ఆ జట్టు నిలిచే అవకాశం ఉంది. స్పిన్‌ను కొంత మెరుగ్గా ఆడుతున్న బట్లర్ ఈసారి బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రానున్నాడు. బౌలింగ్‌లో బాగా బలహీనంగా కనిపిస్తున్న ఇంగ్లండ్ తుది జట్టులో ఏమైనా మార్పులు జరుగుతాయా చూడాలి.
పిచ్, వాతావరణం
లార్డ్స్ పిచ్ అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమంగా అనుకూలిస్తుంది. ఇటీవల దేశవాళీ వన్డే ఫైనల్లో బంతి స్పిన్ తిరిగింది. వాతావరణం పొడిగా ఉంది. వర్ష సూచన లేదు.
►మరో 33 పరుగులు చేస్తే వన్డేల్లో ధోని 10 వేల పరుగులు పూర్తవుతాయి
►మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment