దక్షిణాఫ్రికాదే సిరీస్
రెండో టెస్టులో శ్రీలంక చిత్తు
కేప్‌టౌన్: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో కూడా దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 507 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన లంక నాలుగో రోజు పేసర్ కగిసో రబడా (6/55) ధాటికి 62 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా 282 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (82 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 130/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన లంకను ఆదిలోనే రబడ దెబ్బతీశాడు. నిలకడగా ఆడుతున్న చండిమాల్ (55 బంతుల్లో 30; 3 ఫోర్లు)ను అవుట్ చేయడంతో లంక కోలుకోలేకపోయింది.
దీంతో ఐదో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం ప్రమాదకరంగా మారుతున్న మాథ్యూస్, తరంగ (7 బంతుల్లో 12; 3 ఫోర్లు)ను ఒకే ఓవర్‌లో రబడ పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో హెరాత్ (35 నాటౌట్) కొద్ది సేపు పోరాడినా లాభం లేకపోయింది. ఫిలాండర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఈ టెస్టులో మొత్తం పది వికెట్లు తీసిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రబడా శ్రీలంకపై ఈ ఘనత సాధించిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తాజా ఫలితంతో సఫారీలు మూడు టెస్టుల సిరీస్‌ను 2–0తో గెలుచున్నారు. చివరి టెస్టు 12 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.