కరాచీ: టీ-20 వరల్డ్ కప్ తర్వాత పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది క్రికెట్ కెరీర్ కు తెరపడినట్టే కనిపిస్తోంది. భారత్ లో ఈ మెగా ఈవెంట్ ముగిసిన వెంటనే ఆఫ్రిదిని పాక్ టీ-20 జట్టు కెప్టెన్ పదవి నుంచి తొలగిస్తామని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ సోమవారం తేల్చి చెప్పారు. క్రికెటర్ గా కూడా అతను రిటైరవ్వనున్నారని చెప్పారు.
టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా కోల్ కతా లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై దేశంలో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కోల్ కతా నుంచి స్వదేశం వెళ్లిన పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ లాహోర్ లో విలేకరులతో మాట్లాడారు. పీసీబీకి ఆఫ్రిదికి మధ్య కుదిరిన అవగాహన ప్రకారం వరల్డ్ కప్ కాగానే అతను రిటైర్ అవుతాడని ఆయన స్పష్టం చేశారు.
వరల్డ్ కప్ వరకే ఆఫ్రిది కెప్టెన్ గా ఉంటాడని చెప్పారు. ఆయన తన నిర్ణయం మార్చుకొని క్రికెటర్ గా కొనసాగాలని భావించినా.. అతన్ని ఒక ఆటగాడిగా జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అన్నది ఆలోచిస్తామని ఖాన్ తేల్చిచెప్పారు. అయితే పాక్ టీ20 జట్టు కెప్టెన్ గా ఆఫ్రిదిని నియమించడంలో బోర్డు తప్పిదం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ఆఫ్రిది ఐకానిక్ ఆటగాడని, తన సొంత ప్రతిభతో ఎన్నో మ్యాచులను అతను గెలిపించాడని ఆయన తెలిపారు. కెప్టెన్ గా ఆయన ఎంపిక సరైనదేనని, పెద్ద మ్యాచుల్లో జట్టు ఓడినప్పుడు విమర్శలు సహజమేనని వివరించారు. ప్రస్తుతం జట్టు కోచ్ గా ఉన్న వకాన్ యూనిస్ ను కూడా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఔను, ఆఫ్రిదిని పీకేస్తాం!
Published Mon, Mar 21 2016 7:47 PM | Last Updated on Sat, Mar 23 2019 8:48 PM
Advertisement
Advertisement