అఫ్రిదీ 'ప్రేమ' వ్యాఖ్యలతో చిక్కులు!
లాహోర్: పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ చిక్కుల్లో పడ్డాడు. పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే తమకు ఎక్కువ ప్రేమాభిమానాలు లభిస్తున్నాయన్న ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. ఓ న్యాయవాది అఫ్రిదీకి లీగల్ నోటీసులు పంపాడు.
లాహోర్‌కు చెందిన ఓ న్యాయవాది ఈ నోటీసులు జారీచేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు కోల్‌కతాలో అగుడుపెట్టిన సందర్భంగా అఫ్రిదీ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ' భారత్‌లో ఆడటాన్ని మేం ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉన్నాం. ఇక్కడి ప్రజలు మాపై ఎంతో ప్రేమను చూపారు. కొన్ని దేశాల్లో మాత్రమే నేను క్రికెట్ బాగా ఎంజాయ్ చేశాను. అందులో భారత్ ఒకటి. ఇక్కడ మాకు ఎంతో ప్రేమ లభించింది. ఇంతటి ప్రేమ, మాకు పాకిస్థాన్‌లో కూడా లభించలేదని నేను చెప్పగలను' అంటూ వ్యాఖ్యానించాడు. అఫ్రిదీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పాక్ లాయర్ లీగల్ నోటీసులు పంపారు.
మరోవైపు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ కూడా అఫ్రిది వ్యాఖ్యలపై స్పందించారు. అఫ్రిది మాటలు నన్ను షాక్కు గురి చేశాయి.. ఇలాంటి సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.