వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆఫ్రిది
మొహాలి: టీ-20 వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొని స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఊహించని వివాదానికి తెరలేపాడు. ఆటల్లోకి కశ్మీర్ అంశాన్ని లాగాడు. మంగళవారం మొహాలిలో పాక్-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ తమ జట్టుకు మద్దతుగా కశ్మీర్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చారని అతను పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.
మ్యాచ్ ప్రారంభంలో టాస్ ఓడిన తర్వాత కామెంటేటర్, పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రజా ఆఫ్రిదితో మాట్లాడాడు. మీకు, మీ జట్టుకు ఇక్కడ ప్రేక్షకుల నుంచి మద్దతు లభిస్తున్నాదా? అని అడిగాడు. ఇందుకు 'చాలామంది కశ్మీర్ ప్రజల' నుంచి మద్దతు లభిస్తోంది అంటూ అతను తెలిపాడు. 'మొహాలిలోనూ మీకు అభిమానులు ఉన్నట్టు కనిపిస్తోంది' అని రజా పేర్కొనగా.. 'ఔను. కశ్మీర్ నుంచి కూడా చాలామంది ప్రజలు వచ్చారు. ఇక కోల్‌కతా ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. వారు కూడా మద్దతు తెలిపారు' అని ఆఫ్రిది పేర్కొన్నాడు. టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా టాస్ గెలిచిన న్యూజిల్యాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 180 పరుగులు చేసింది.
ఆఫ్రిది ఇప్పటికే పెద్ద వివాదంలో ఎదుర్కొన్నాడు. పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే తమకు ఎక్కువ అభిమానం లభిస్తుందని అతను పేర్కొన్న వ్యాఖ్యలు స్వదేశంలో అతన్ని ఇరకాటంలో పడేశాయి. దీనికితోడు భారత్ చేతిలో పాక్ జట్టు ఘోరంగా ఓడటం కూడా అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతన్ని జట్టు సారథిగా తొలగిస్తామని ఇప్పటికే పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.