
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వినూత్న రీతిలో ఔటైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. లండన్‌లో జరిగిన ఓ టీ10 మ్యాచ్ సందర్భంగా అఫ్రిది బ్యాట్ విరగొట్టుకుని, అదే బంతికి ఔటయ్యాడు. వివరాల్లోకి వెళితే.. టీమ్ యూరప్, బ్రిటిష్ అండ్ ఐరిష్ నైట్స్ జట్ల మధ్య జరిగిన ఓ టీ10 మ్యాచ్‌లో అఫ్రిది పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ యూరప్‌కు ప్రాతినిథ్యం వహించిన అఫ్రిది.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు.
A 𝘽𝘼𝙏𝘵𝘭𝘦 lost 😄
— European Cricket (@EuropeanCricket) April 7, 2024
Have you seen anything like this before? 👀 #EuropeanCricket #StrongerTogether #WestonShield pic.twitter.com/K25AWxN9Qo
ఒలివర్ రిలే బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అఫ్రిది పెవిలియన్‌కు చేరాడు. ఒలివర్ సంధించిన బంతిని అఫ్రిది లెగ్ సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లో లేచింది. బంతి బలంగా తాకడంతో బ్యాట్ రెండు ముక్కలైంది. హ్యాండిల్ అఫ్రిది చేతిలోనే ఉండిపోగా.. మరో ముక్క లెగ్ సైడ్ దిశలో వెళ్లి పడింది. గాల్లోకి లేచిన బంతిని ఒలివర్ క్యాచ్ పట్టుకోవడంతో అఫ్రిది వినూత్న రీతిలో ఔటయ్యాడు. క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి.
కాగా, 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షాహిద్ అఫ్రిది.. నాటి నుంచి విదేశీ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో అఫ్రిది కనిపిస్తూ ఉంటాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలోనూ అఫ్రిది దర్శనమిచ్చాడు. క్రికెట్‌తో అనునిత్యం టచ్‌లో ఉండే అఫ్రిది టీవీ డిబేట్లలో పాల్గొంటుంటాడు. 47 ఏళ్ల అఫ్రిది ప్రస్తుత పాక్ క్రికెటర్‌కు పిల్లనిచ్చిన మామ. అఫ్రిది కుమార్తెను షాహీన్ అఫ్రిది పెళ్లి చేసుకున్నాడు.
విధ్వంసకర బ్యాటర్ అయిన అఫ్రిది పేరిట అప్పట్లో వన్డే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉండేది. కెన్యాలోని నైరోబీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. చాలాకాలం వరకు ఇది వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. ప్రస్తుతం వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 2015లో వెస్టిండీస్‌పై 31 బంతుల్లోనే శతక్కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment