ఆఫ్రిదిపై పాక్‌లో రచ్చ... రచ్చ...
కెప్టెన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు
కోల్‌కతా: మైదానంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఏమో కానీ ఆ జట్టు చుట్టూ నిరంతరం వివాదాలు వెన్నంటే ఉంటాయి కాబోలు.. మొన్నటి వరకు భద్రతా కారణాలు చూపి టి20 ప్రపంచకప్‌లో పాక్ జట్టు ఆడుతుందా.. లేదా? అనే అనుమానం ఉన్నా ఆ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. తీరా పాక్ జట్టు భారత్‌లో అడుగుపెట్టిందో లేదో ఆఫ్రిది రూపంలో మరో రచ్చ మొదలైంది. యథాలాపంగా అన్నాడో.. మరేంటో కానీ తమ జట్టుకు పాక్‌కన్నా భారత్‌లోనే అభిమానం ఎక్కువ అన్న ఈ సీనియర్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్‌లో అతడిని దోషిగా మార్చాయి.
‘ఇతర దేశాలకన్నా భారత్‌లో ఆడడాన్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. భారత్‌లో నాకు ఆదరణ ఎక్కువ. అసలు మా జట్టుకు పాక్‌లోకన్నా భారత్‌లోనే ఎక్కువ అభిమానం లభిస్తుంది’ అని గత ఆదివారం ఆఫ్రిది అన్నాడు. దీంతో భారత్‌ను బద్ద శత్రువుగా భావించే అక్కడి అభిమానులు, మాజీ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. భారత్‌కు వెళ్లింది ఆ దేశాన్ని పొగడడానికా.. మ్యాచ్‌లు ఆడడానికా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ‘మన దేశ క్రికెట్‌కు భారత్ చేసిన సేవ ఏమిటని పొగుడుతున్నావ్.. నీవు సిగ్గుపడాల్సిన విషయమిది’ అని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ విరుచుకుపడ్డారు. ఇక ఆఫ్రిది తన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ప్రజల మనోభావాలను గాయపరిచాడంటూ అతడికి ఓ లాయర్ లీగల్ నోటీసులు కూడా పంపాడు.
పాజిటివ్‌గా తీసుకోవాలి: ఆఫ్రిది
తన కామెంట్స్‌తో అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముట్టడంతో పాక్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వివరణ ఇచ్చుకున్నాడు. తన వ్యాఖ్యలను అంతా పాజిటివ్‌గా తీసుకోవాలని సూచించాడు. ఇక్కడి అభిమానులను గౌరవించే ఉద్దేశంతోనే అలా మాట్లాడానని చెప్పాడు. ‘నేను ఇప్పుడు ఇక్కడ కేవలం పాక్ జట్టు కెప్టెన్ మాత్రమే కాను. మొత్తం పాక్ ప్రజల ప్రతినిధిని. నా వ్యాఖ్యలను పాజిటివ్ దృష్టితో చూస్తే సరైనవే అనిపిస్తుంది. విలేకరి అడిగిన ప్రశ్నకు సానుకూలంగా సమాధానమిచ్చాను.
ఇక్కడ ఆడే మ్యాచ్‌లను మేం బాగా ఆస్వాదిస్తాం. అదే చెప్పాను. ఇక్కడ క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తారు. ఇమ్రాన్, వసీం, వఖార్, ఇంజమామ్‌లను అడిగినా ఇక్కడి ఆదరణ గురించి చెబుతారు. పాక్ అభిమానులను అవమానపరిచే ఉద్దేశం లేదు. నాకు గుర్తింపునిచ్చింది పాకిస్తానే’ అని ఆఫ్రిది స్పష్టం చేశాడు. మరోవైపు అతడి వ్యాఖ్యలకు పాక్ కోచ్ వఖార్ యూనిస్ మద్దతు పలికాడు. అందులో ఎలాంటి తప్పు లేదని తేల్చాడు. దృష్టంతా ఆట మీద నిలపాలని తమ ఆటగాళ్లకు హితవు పలికారు.
ప్రాక్టీస్‌కు గైర్హాజరు
మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు ఆఫ్రిది గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. అయితే జ్వరం కారణంగానే తను తప్పుకున్నాడని కోచ్ వఖార్ యూనిస్ తెలిపారు. ‘వివాదం కారణంగా తను గైర్హాజరు కాలేదు. ఉదయం నుంచి కాస్త నలతగా ఉన్నాడు. అందుకే విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని చెప్పాం’ అని వఖార్ అన్నారు.