
షేక్ షేక్ షకీరా !
ముగింపు కార్యక్రమంలో సందడి చేయనున్న పాప్ స్టార్
రియో డి జనీరో: కొలంబియా పాప్ స్టార్ షకీరా ప్రపంచకప్‌లో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గత రెండు ప్రపంచకప్‌లలో తన ఆట, పాటతో సందడి చేసిన షకీరా.. ఈ సారి టోర్నీ ముగింపు ఉత్సవంలో తళుక్కున మెరవబోతోంది. జూలై 13న రియో డి జనీరోలో జరిగే మెగా ఫైనల్‌కు ముందు పాప్ స్టార్ ప్రదర్శన ఇవ్వనుంది.
ఫిఫా అధికారిక గీతం ‘లా లా లా’తో ఇప్పటికే హల్‌చల్ చేస్తున్న కొలంబియా భామ.. బ్రెజిల్ స్టార్ కర్లినో బ్రౌన్‌తో కలిసి ఆడి పాడనుంది. ఇక ఫిఫా మరో అధికారిక గీతాన్ని (‘దార్ ఉమ్ జీటో-వియ్ విల్ ఫైండ్ ఎ వే’) సాంటనా, వెక్లైఫ్‌తో పాటు బ్రెజిల్ సింగర్ అలెగ్జాండర్ పెరైస్ ముగింపు కార్యక్రమంలో ఆలపించనున్నారు. దీంతో పాటు స్థానిక కార్యక్రమాలు అభిమానులను అలరించనున్నాయి.