
పాక్‌కు షాక్
అబుదాబి: ఆస్ట్రేలియాతో మూడో వన్డే... చివరి ఓవర్లో విజయానికి పాకిస్థాన్ కేవలం 2 పరుగులు చేయాలి. చేతిలో మరో 2 వికెట్లు ఉన్నాయి.
అబుదాబి: ఆస్ట్రేలియాతో మూడో వన్డే... చివరి ఓవర్లో విజయానికి పాకిస్థాన్ కేవలం 2 పరుగులు చేయాలి. చేతిలో మరో 2 వికెట్లు ఉన్నాయి. ఈ దశలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌కు దిగాడు. తొలి బంతిని ఆడలేకపోయిన తన్వీర్, రెండో బంతికి బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇర్ఫాన్‌కు వరుసగా మూడు బంతుల్లో ఒక్క పరుగు తీయడం కూడా సాధ్యం కాలేదు. చివరి బంతిని మాత్రం భారీ షాట్ ఆడబోయి అతను కవర్స్‌లో చిక్కాడు. అంతే ... ఆఖరి ఓవర్ మెయిడిన్ సహా 2 వికెట్లు... ఒక పరుగు తేడాతో ఆస్ట్రేలియాకు విజయం. 3-0 తేడాతో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్.
అనిశ్చితికి మారుపేరైన, లక్ష్య ఛేదనలో పేలవ రికార్డు ఉన్న పాకిస్థాన్ మరోసారి దానిని నిరూపించుకుంది. 231 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 50 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. అసద్ షఫీఖ్ (73 బంతుల్లో 50; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, మఖ్సూద్ (46 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ (39 బంతుల్లో 32; 2 ఫోర్లు) రాణించారు. స్టీవెన్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ నెల 22 నుంచి ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగుతుంది.
స్మిత్ క్యాచ్‌పై వివాదం...
మరోవైపు ఈ మ్యాచ్‌లో ఫవాద్ ఆలం క్యాచ్‌ను లెగ్‌స్లిప్‌లో స్టీవెన్ స్మిత్ అందుకున్న తీరు వివాదాస్పదంగా మారింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ డోహర్తి వేసిన మ్యాచ్ 18వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫవాద్ బంతిని ఎదుర్కొనే ముందు స్మిత్ స్లిప్‌లో ఉన్నాడు. అయితే ఫవాద్ స్వీప్ షాట్‌కు ప్రయత్నిస్తున్న విషయాన్ని పసిగట్టిన అతను లెగ్‌స్లిప్ వైపు వేగంగా దూసుకొచ్చి అనూహ్యంగా క్యాచ్ అందుకున్నాడు. థర్డ్ అంపైర్‌తో చర్చల అనంతరం ఫీల్డ్ అంపైర్లు ఫవాద్‌ను అవుట్‌గా ప్రకటించారు.
‘బౌలర్ బంతిని విసిరాక అది బ్యాట్స్‌మన్ వద్దకు చేరేలోపు ఫీల్డర్ చెప్పుకోదగ్గ కదలికలు చేయరాదు. అలా చేస్తే అంపైర్లు దానిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి’ అని ఎంసీసీ 41.7 నిబంధన చెబుతోంది. దీని ప్రకారం చూస్తే స్మిత్ క్యాచ్ న్యాయబద్ధమైంది కాదు. ఈ అంశంపైనే వివాదం రేగింది. అయితే ‘చెప్పుకోదగ్గ కదలికలు’ అనేదానిపైనే స్పష్టత లేదు. దాంతో ఐసీసీ మ్యాచ్ తర్వాతి రోజు దీనిపై వివరణ ఇచ్చింది.
ఈ నెల 1నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం స్మిత్ క్యాచ్ సరైందేనని వెల్లడించింది. ‘41.8 నిబంధన ప్రకారం బ్యాట్స్‌మన్ కదలికలను బట్టి క్లోజ్ ఫీల్డర్ తన స్థానం కొద్దిగా మార్చుకుంటే తప్పు లేదు. అయితే బ్యాట్స్‌మన్ ఏకాగ్రతకు భంగం కలిగితే దానిపై నిర్ణయం తీసుకునే అధికారం అంపైర్లకు ఉంటుంది’ అని పేర్కొంది.